వార్ధా(మహారాష్ట్ర): బలహీన వర్గాలకు చెందిన పిహెచ్‌డి విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించడానికి రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించాలని మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయ(ఎంజిఎహెచ్‌వి) విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐఐటి బాంబే, ఐఐటి మద్రాసులో ఈ వారంలో సంభవించిన రెండు క్యాంపస్ ఆత్మహత్యల వంటి సంఘటనలను నివారించడానికి ప్రభుత్వం చట్టాన్ని రూపొందించాలని విద్యార్థులు కోరారు. గడచిన మూడు రోజుల్లో సంభవించిన రెండు ఆత్మహత్యల ఘటనలపై తీవ్రంగా కలత చెందిన ఎఐఎస్‌ఎఫ్ ఎంజిఎహెచ్‌వి విభాగానికి చెందిన సభ్యులు వర్సిటీ రిజిస్ట్రార్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతి పత్రం సమర్పించారు.
దేశంలోని వివిధ యూనివర్సిటీ క్యాంపస్‌లో బస చేసి చదువుకుంటున్న బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులను కాపాడుకునేందుకు నిర్భయ చట్టం తరహాలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని 2016 నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఎఐఎస్‌ఎఫ్ అధ్యక్షుడు చందన్ సరోజ్ తెలిపారు. ఓబిసి వర్గానికి చెందిన పిహెచ్‌డి స్కాలర్ రోహిత్ వేముల కుల వివక్ష, వేధింపుల కారణంగా 2017 జనవరిలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా యూనివర్సిటీ క్యాంపస్‌లలో నిరసనలు వెల్లువెత్తాయి.
తాజాగా..ఫిబ్రవరి 12న ఐఐటి బాంబేలో అహ్మాదాబాద్‌కు చెందిన దర్శన సోలంకి(18) అనే విద్యార్థి, ఫిబ్రవరి 14న ఐఐటి మద్రాసులో ముంబైకు చెందిన ఎస్ అలప్పట్(24) అనే విద్యార్థి క్యాంపస్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐఐటి మద్రాసులోనే ఇటీవల మరో విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రస్తుతం చెన్నైలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనలను ఎఐఎస్‌ఎఫ్ తన వినతిపత్రంలో పేర్కొంది.