Sunday, February 23, 2025

భర్త చనిపోతే భార్యకు.. భార్య చనిపోతే భర్తకు ‘ఆసరా’ వర్తింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో దార్రిద్య దిగువ రేఖకు లోబడి ఉన్న ప్రతి కుటుంబానికి ఆసరా పథకం వర్తింప జేసేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేసింది. ఇప్పటికే భర్త చనిపోతే వితంతు మహిళలకు వెంటనే ఆసరా పింఛన్ పథకంలో అర్హురాలిగా గుర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో వితంతువుల నుంచి ఆసరా పథకానికి దరఖాస్తులను స్వీకరించడంతో పాటు గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేకంగా సర్వే నిర్వహించి…లబ్ధిదారుల పేర్ల గుర్తించారు. ఈ నెలాఖరులోగా కొత్తగా గుర్తించిన వారి జాబితాను ప్రకటించనున్నారు. వీరికి త్వరలోనే రూ.2016 నగదును ఆసరా పింఛన్ కింద అందజేయనున్నారు.
కుటుంబంలో ఒకరికే ఆసరా…
కుటుంబ సామాజిక భద్రతలో భాగంగా ఆసరా పథకానికి అర్హులుగా 57 ఏళ్లకు పైబడి ఉన్న భార్య, భర్తల్లో ఒకరికి మాత్రమే కుటుంబానికి వర్తింపజేసేలా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే ఆసరా పింఛన్ పొందుతున్న వృద్ధురాలైన భార్య చనిపోతే.. ఆమె స్థానంలో 57 ఏళ్లకు పైబడి ఉండే భర్తలకు ఆ స్థానంలో అర్హత కల్పించేలా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిరుపేద కుటుంబాల్లో భార్య చనిపోయినా.. వారికి సామాజిక భద్రత కల్పించేలా ఆసరా పథకాన్ని అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
నగరాల్లో పింఛన్‌దారులకు తప్పని ఇక్కట్లు..
గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 57 ఏళ్లకు పైబడిన వారికి ఆసరా పథకం వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రకటించి.. ఆగస్టు నుంచి ఆసరా మొత్తాన్ని అందజేస్తున్నారు. అయితే రాష్ట్ర రాజధాని శివారు పట్టణ ప్రాంతాలతో పాటు పలు నగరాల్లో బ్యాంకుల ద్వారా పింఛన్ పొందే లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం అయినా.. ఎన్‌పిసిఐకి బ్యాంకులు లబ్ధిదారుల పేర్లు అనుసంధానం చేయకపోవడంతో వారికి ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం జమ చేసే మొత్తాన్ని పొందలేకపోతున్నారు.

తమ పేర్లు జాబితాలో ఉన్న ఆసరా నగదు మొత్తం అందకపోవడంపై అర్హులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులను ఈ విషయమై సంప్రదించిన స్పందన లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. బ్యాంకు ఖాతాలు ఉన్న ఆసరా పింఛన్ దారుల ఆధార్, ఎన్‌పిసిఐ అనుసంధానం సంబంధిత బ్యాంకు అధికారులు చేయాలని సెర్ఫ్‌లోని ఆసరా పథకం విభాగం ఉన్నతాధికారులు వెల్లడిస్తుండగా.. బ్యాంకు అధికారులు మాత్రం తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News