Monday, December 23, 2024

పార్లమెంట్‌లో సరైన ప్రకటనే చేశా

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ సెక్రటేరియట్‌కు జవాబిచ్చిన రాహుల్

న్యూఢిల్లీ : బీజేపీ సభ్యుల నోటీసుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సెక్రటేరియట్‌కు వివరణాత్మక సమాధానం ఇచ్చారు. పార్లమెంట్‌లో తాను మాట్లాడిన ప్రకటన సరైందే అని ఆయన సమర్ధించుకున్నారు. ఇదే విషయాన్ని సోమవారం నాటి వాయనాడ్ బహిరంగ సభలో కూడా రాహుల్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆయన తన సమాధాన పత్రాన్ని లోక్‌సభ సచివాలయానికి పంపించారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 7 న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా హిండెన్‌బర్గ్ అదానీ అంశాన్ని లేవనెత్తి ప్రధాని మోడీపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

మోడీతో అదానీ ఉన్న ఫోటోను సభలో ప్రదర్శించారు. దీనికి ఎన్‌డిఎ సభ్యులు తీవ్ర అభ్యంతరం పెట్టారు. అనంతరం రాహుల్ వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. దీనికి సంబంధించి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును కేంద్ర మంత్రి లోక్‌సభ సెక్రటేరియట్‌కు పంపించారు. దాంతో లోక్‌సభ సెక్రటేరియట్ సమాధానం కోరుతూ రాహుల్‌కు ఈనెల 10 న నోటీస్ పంపింది. లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునేలా రాహుల్ వివిధ చట్టాలను ఉటంకిస్తూ అనేక పేజీల్లో వివరణాత్మక సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News