Friday, December 20, 2024

నకిలీ ఇన్సూరెన్స్ ఏజెంట్ల ఘరానా మోసం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఇన్సూరెన్స్ ఏజెంట్ల పేరుతో రిటైర్డ్ ఉద్యోగి నుంచి భారీ ఎత్తున డబ్బులు తీసుకుని మోసం చేసిన యూపి ముఠాను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, 14 సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్,హార్డ్ డిస్క్, రూ.1.50లక్షల నగదు, ఎనిమిది ఎటిఎం కార్డులు, నాలుగు పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్‌కు చెందిన మురషీద్ అన్సారీ అలియాస్ రిహాన్, వికాస్ సింగ్, సోను, తరుణ్ శర్మ, మనీష్ టాంగర్, లలిత్ కుమార్ కలిసి మోసాలు చేస్తున్నారు. మురషీద్, వికాస్‌సింగ్, సోను గతంలో ఇన్సూరెన్స్ పాలసీ పేరుతో మోసం చేస్తున్న నకిలీ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ జరుగుతున్న విషయాలను మొత్తం తెలుసుకున్నారు.

తర్వాత వీరే ఓ నకిలీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో ముగ్గురిని టెలీ కాలర్లుగా నియమించుకున్నారు. వారి బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకున్నారు. పాలసీలు చేసిన వారి సమాచారం తీసుకుని వారికి ఫోన్లు చేస్తున్నారు. ఎక్కువగా పాలసీలు చేయిస్తే భారీగా డబ్బులు వస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగికి నిందితులు ఫోన్ చేశారు. పాలసీలు చేయిస్తే భారీగా డబ్బులు వస్తాయని చెప్పారు. బాధితుడిని నమ్మించేందుకు రూ.2,రూ.4, రూ.5కోట్ల డిడిలు చూపించి వాటిని పంపిస్తామని చెప్పారు. ఇది నిజమని నమ్మిన బాధితుతుడు తన బంధువులు 12మందితో పాలసీలు కట్టించాడు. తర్వాత డిడిల డబ్బులు రావాలన్నారు, జిఎస్‌టి తదితరాల పేర్లు చెప్పి 2016 నుంచి 2022 వరకు బాధితుడి నుంచి రూ.1.60 కోట్లు వసూలు చేశారు.

అయినా కూడా బాధితుడికి రూపాయి ఇవ్వకుండా మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో తాను మోసపోయానని గ్రహించి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం ఇన్స్‌స్పెక్టర్ రాజు దర్యాప్తు చేసి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News