హైదరాబాద్: బిజెపికి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. గురువారం గుంటూరులోని తన నివాసంలో అనుచరులతో సమావేశమైన ఆయన బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో సమస్య లేదన్నారు. ఎటుతిరిగి ఎపి బిజెపి రాష్ట్ర నాయకత్వం తీరు సరిగా లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర బిజెపిలో తాను పనిచేయలేని పరిస్థితి కల్పించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను బిజెపిలో ఉండటం వలన తనతో పాటు నమ్ముకున్న వారికి కూడా భవిష్యత్ ఉండదన్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో బిజెపికి రాజీనామా చేయడమే మేలు అని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇదిలావుండగా కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేనలోకి వెళ్ళాలని ఆయన ఆలోచన చేసినప్పటికీ ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఆదరణపై సందేహాలు, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మినహా ఆదరణ కలిగిన వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో ఆ ప్రతిపాదనను కన్నా విరమించుకున్నారనే ప్రచారం జరుగుతోంది.