గజ్వేల్:తెలంగాణ రాష్ట్ర అప్పులు, మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవాలు, పచ్చి అబద్దాలు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె కేవలం రాష్ట్రంపై బురద జల్లాలనే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో అప్పులు పెరగడాని కి ముమ్మాటికీ కేంద్ర వైఖరే కారణమని ఆయన ఆరోపించారు. దీనిపై అసెంబీల్లో ముఖ్యమంత్రి కె సిఆర్ చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రం గా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రూకవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మం త్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నిర్మలా సీతారామన్‌పై ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. 202420-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారన్నారు. కానీ ఇప్పటి వరకు కేంద్రం సాధించింది కేవలం 3.3 ట్రిలియన్ మాత్రమేనని అన్నారు. ఇక మిగిలిన ఒ క్క ఏడాదిలో మిగతా లక్ష్యాన్ని సాధించడం సాధ్య మా? అని కెసిఆర్ అసెంబ్లీ ప్రశించారన్నారు. కేం ద్రం పెట్టుకున్న లక్ష్యం సరిగ్గా లేదు.. కార్యాచరణ లేదనే కెసిఆర్ అన్నారన్నారు.
ఆయన చేసిన జోకు ఏముందో నిర్మలా సీతారామన్ చెప్పాలన్నారు. ఈ విషయంలో ఆమె నిజాలు చెప్పలేక వ్యంగ్యంగా మాట్లాడి తప్పుదోవ పట్టించే యత్నం చేశారని విమర్శించారు. ఒక్క ఏడాదిలో ఎలా మిగిలిన 1.7 ట్రిలియన్‌ను ఎలా సాధించగలుగుతారో దమ్ముంటే దేశ ప్రజజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి కేంద్రం చెబుతున్న దానికి, చేస్తున్న దానికి అసలు పొంతనే లేదని హరీశ్‌రావు అన్నారు. అధికారంలోకి వస్తే రై తుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు….మరి చేశారా? అని కేంద్ర మంత్రిని ఆయన నిలదీశారు. ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ఏమోగానీ….రైతుల పెట్టబడిని మాత్రం రెట్టింపు చేశారని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్, పెట్టుబడి ఖర్చులు పెంచి రైతుల నడ్డివిరిచారని ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కేంద్రం నిర్వాకం వల్లే అప్పులు
కేంద్రం అసమర్ధ నిర్వాహకం వల్లే రాష్ట్రం అప్పులు చేయాల్సి వచ్చిందని మంత్రి హరీష్‌రావు వివరించారు. జిఎస్‌టి పన్నుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.1.25 లక్షల కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఫైనాన్స్ కమిషన్ నిర్ణయాలను తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జిఎస్‌టి నిధులను తెలంగాణకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఆర్టికల్ 293కి లోబడే తెలంగాణ అప్పులు తీసుకుందని, తీసుకున్న నిధులతో ప్రాజెక్టు నిర్మాణాలను, అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తెచ్చి అభివృద్ధి చేయకపోగా వడ్డీలు కడుతోందన్నారు. 2014లో తెలంగాణలో అప్పులు రూ.60వేల కోట్లు ఇప్పుడు మూడు లక్షల కోట్లు దాటిందన్నారు. కరోనా కారణంగా అందరం అప్పులు తెచ్చుకున్నామన్నారు. ఇప్పుడు అప్పులు తీరుస్తున్నామన్నారు. రాష్ట్రాలు చేసే అప్పులను పరిశీలించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందన్నారు. ఇది రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధన దానినే తాము అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోమన్నందుకు కేంద్రం నుంచి రాష్ట్రం రూ. 16,653 కోట్లు కోల్పోయమన్నారు. అలాగే రైతుల పక్షాన రక్షణగా నిలిచినందుకు కేంద్రం విధించిన శిక్ష ఏంటంటే… ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ అయిన 20212026 ఐదేండ్ల కాలంలో రూ. 30 వేల కోట్లు రాష్ట్రానికి రాకుండా పోతున్నాయన్నారు.
ఇక 15వ ఫైనాన్స్ కమిషన్ మాటలను గౌరవించే సంప్రదాయాన్ని తుంగలో తొక్కిన కేంద్రం, తెలంగాణ రాష్ట్రానికి కమిషన్ ఇవ్వమని చెప్పిన స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ రూ. 5,374 కోట్లను నిస్సిగ్గుగా ఎగ్గొట్టిందని మండిపడ్డారు. ఫైనాన్స్ కమిషన్ 202220-23 బకాయిలు రూ. 2,016 కోట్ల విషయంలో కేంద్రం మొండి చేయి చూపించిందని హరీష్‌రావు అన్నారు.కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.5 వేల కోట్ల నిధులకు సైతం ఎగనామం పెట్టిందన్నారు. విద్యుత్తు వినియోగంపై మూడు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని చెప్పిన కేంద్రం.. తెలంగాణకు ఎపి నుంచి రావాల్సిన రూ. 17 వేల 800 కోట్లను ఇప్పించలేదన్నారు. ఎపికి ఎఫ్‌ఆర్‌బిఎంలో ఆరు వేల కోట్లు ఇచ్చారన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు రూ.1,350 కోట్లను ఇప్పటికీ కేంద్రం చెల్లించలేదన్నారు. ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సిన నిధులేనని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఇక నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మిషన్ భగీరథ నిధులు 19,205 కోట్లు, మిషన్ కాకతీయ 5 వేల కోట్లు, మొత్తంగా 24,205 కోట్లు కూడా తెలంగాణకు రావాల్సి ఉందన్నారు. .
మెడికల్ కాలేజీల విషయంలోనూ అన్యాయమే
మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఆ అన్యాయంపై తాము కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఖమ్మం, కరీంనగర్‌కు మెడికల్ కాలేజీలు ఇవ్వమని కేంద్రం చెప్పడంపై ఆయన మండిపడ్డారు. తమకు మెడికల్ కాలేజీలు ఇవ్వమని చెప్పిన బిజెపి ఎందుకు ఓటు వేయాలో కరీంనగర్, ఖమ్మం ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తారని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఉన్నదేమీ లేదని, అంతా డొల్ల అని ఎద్దేవా చేశారు. పేదల మేలుకు సంబంధించిన ఒక్క అంశం కూడా కేంద్ర బడ్జెట్‌లో లేదన్నారు. పైగా కార్పోరేట్లకు పన్నులు తగ్గించారని విమర్శించారు. రైతుల గురించిగానీ, మహిళల గురించిగానీ వృత్తుల గురించిగానీ పేదల గురించిగానీ బడ్జెట్‌లో ప్రస్తావన లేదని పేదలకు కోతలు పెట్టినారే తప్ప మేలు చేయలేదని మండిపడ్డారు.ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ ఉంటే కేంద్రం మెడికల్ కాలేజీలు కేటాయించాలని మంత్రి కోరారు. అదేవిధంగా విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి సంక్రమించిన అన్ని హక్కులను కేంద్రం గౌరవించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రులది రోజుకో మాట
కేంద్ర ప్రయోజిత పథకం కింద మోడీ సర్కార్ 157 మెడికల్ కాలేజీలు ఇస్తామంటే, తెలంగాణ ప్రభుత్వం కూడా వినతులు పంపిందన్నారు. అందులో ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు ఇవ్వాలని కోరామన్నారు. ఆ రెండు జిల్లాలు తెలంగాణలో భాగం కాదా? అని ప్రశ్నించారు. పెద్ద నగరాలు, ఎక్కువ జనాభా గల జిల్లాల్లో మెడికల్ కాలేజీలు కావాలని అడిగామని…అవి ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఇతర రాష్ట్రాలకు ఒక నీతి, తెలంగాణకు మరో నీతితో వ్యవహిరిస్తోందని హరీష్‌రావు మండిపడ్డారు. దీని వల్ల రాష్ట్రానికి అన్నింటిలోనూ అన్యాయమే జరుగుతోందన్నారు. కేంద్రం వివక్ష వల్ల గతంలో మెడికల్ కాలేజీలు రాకుండా పోతే, ప్రస్తుతం నర్సింగ్ కాలేజీలు రాకుండా పోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదని కేంద్ర మంత్రి అనడం పచ్చి అబద్దమన్నారు. నిజానికి ఆయుష్మాన్ భారత్ కంటె ఆరోగ్యశ్రీ వంద రెట్లు మంచిదన్నారు. ఆరోగ్య శ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం యేటా రూ. 800 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఆయుష్మాన్ ద్వారా కేంద్రం రూ. 150 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో సంపద పెరిగింది
తెలంగాణ సంపద గణనీయంగా పెరిగిందని హరీష్‌రావు అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పడు జిఎస్‌డిపి నాలుగున్నర లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు 13 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. రుణాలు జిడిపి శాతాన్ని 25.5 నుంచి 24.8 శాతానికి తగ్గింపు దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం చేస్తుంటే, కేంద్రం మాత్రం పెంచే ప్రయత్నం చేస్తోందని ఆయన తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. పైగా కేంద్రం విధిస్తున్న అనేక ఆంక్షలు వల్ల అప్పులు చేయక పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉదయ్ స్కీం కింద విద్యుత్ సంస్థల అప్పులను రాష్ట్రాలు చేయాలని కేంద్రం చెప్పిందన్నారు. అలాగే జిఎస్‌టి నష్ట పరిహారాన్ని గ్రాంట్ రూపంలో ఇవ్వాల్సింది పోయి…. అప్పు రూపంలో తీసుకోమని ఆదేశాలు జారీ చేసిందన్నారు. కేంద్ర బడ్జెట్ అంతా డొల్ల, డబ్బాలో రాళ్లేసి ఊపినట్లు ఉందని విమర్శించారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రికి తెలంగాణ రాష్ట్రంపై ఏమాత్రం ప్రేమ ఉన్నా…. రైతుల మీద దయ ఉన్నా, ప్రజల మీద జాలి ఉన్నా రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.