న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సిబిఐ మరోసారి శనివారం సమన్లు జారీ చేసింది. ఛార్జీషీటు దాఖలు చేసిన మూడు నెలల తర్వాత సమన్లు జారీచేసింది.ఈ విషయాన్ని సిబిఐ వర్గాలు వెల్లడించాయి. కాగా తాజా సమన్లపై సిసోడియా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘మద్యం కుంభకోణం కేసులో రేపు విచారణకు రావాలని సిబిఐ నన్ను మరోసారి పిలిచింది. నాకు వ్యతిరేకంగా వారు సిబిఐ, ఈడిలను పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్నారు. విచారణకు నేను ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటాను’ అని సిసోడియా ట్వీట్ చేశారు.
సిసోడియాను ప్రశ్నించేందుకు సిబిఐ పిలిచింది. అయితే అభియోగపత్రంలో ఆయనని నిందితుడిగా పేర్కొనలేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ అరెస్టు చేసిన వారిలో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి తదితరులు ఉన్నారు. లంచాలు చెల్లించిన కొంతమంది డీలర్లకు ఫేవర్‌గా ఢిల్లీ ప్రభుత్వం లైసెన్సులు జారీచేసిందన్నది అభియోగం. అయితే దానిని ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరించింది.
సిబిఐ గతంలోనే ఈ కేసులో సిసోడియాను విచారించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిసోడియా హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు చేపట్టింది. సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్‌ను అరెస్టు చేసింది.