Saturday, November 16, 2024

మనం కలిస్తే.. బిజెపికి వంద సీట్లు కూడా రావు..

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) నేత నితీశ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో విపక్షాలు ఏకమయితే బిజెపికి 100 సీట్లు కూడా రావంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో విపక్షాల పొత్తులపై కాంగ్రెస్ చర్చలు ప్రారంభించాలని సూచించారు. పాట్నాలో జరిగిన సిపిఐఎంఎల్ జాతీయ సదస్సు చివరి రోజయిన శనివారం నాడు నితీశ్‌కుమార్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నితీశ్‌కుమార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.‘ రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాం. దేశ ప్రధానమంత్రి పదవిపై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోరికా లేదు. మేము మార్పును మాత్రమే కోరుకుంటున్నాం. సమష్టిగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే’ అని అన్నారు.

‘విపక్షాలను ఏకం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలి. భారత్ జోడో వంటి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఆ పార్టీ అక్కడితో ఆగిపోకూడదు. విపక్షాల ఐక్యత విషయంలో కాంగ్రెస్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి. గతంలో ఢిల్లీకి వెళ్లి రాహుల్, సోనియాను కలిశాం. విపక్షాలు ఏకమయితే బిజెపిని ఓడించడం సాధ్యమే’నని నితీశ్ అన్నారు.‘ వారు (కాంగ్రెస్) నా సూచనను స్వీకరించి కలిసి పోరాడితే బిజెపి 100 సీట్లకన్నా దిగువకు పోతుంది. కానీ వారు నా సూచనను తీసుకోకపోతే ఏమవుతందో మీకు తెలుసు’ అంటూ వేదికపై ఉన్న కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వైపు చూస్తూ నితీశ్ అన్నారు. గత ఏడాది తాను ఎన్డీనుంచి వైదొలగడంతో బీహార్‌లో తన ఉనికిని విస్తరించడానికి బిజెపి చేసిన ప్రయత్నాలకు తెరపడిందని ఆయన అంటూ. అయితే జాతీయ స్థాయిలో కూడా ఇలాంటిదే సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

బిజెపిని కానీ, ఆ పార్టీ నేతల పేర్లనుకానీ నేరుగా ప్రస్తావించని నితీశ్ ఈ వ్యక్తులనుంచి విముక్తి పొందడానికి లోక్‌సభ ఎన్నికలు ఒక అవకాశమన్నారు. దేశంలో మత ఉద్రిక్తతలు పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ దేశ విభజన సమయంలో రక్తపాతంతో తడిసినప్పటికీ హిందువులు, ముస్లింలు శాంతితో జీవించారన్నారు. బిజెపి సైద్ధాంతిక సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ, స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో ఎలాంటి పాత్ర లేని వాళ్లు ఇప్పుడు చరిత్రను తిరగరాయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్, సిసిఐ( ఎంఎల్) లిబరేషన్ పార్టీ సెక్రటరీ జనరల్ దీపాంకర్ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News