సెయింట్ జార్జ్ పార్క్: మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 11 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా టీమిండియాకు సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే ఐర్లాండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే భారత్‌కు సెమీస్ అవకాశాలు ఉంటాయి. గ్రూప్‌బిలో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఓపెనర్లు డంక్లి(10), డానియల్ వ్యాట్ (0)లు విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన కాప్సి(3) కూడా నిరాశ పరిచింది.
దీంతో ఇంగ్లండ్ 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లు కూడా రేణుకా సింగ్‌కే దక్కాయి. ఈ దశలో సివర్ బ్రాంట్‌తో కలిసి కెప్టెన్ నైట్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన సివర్ ఐదు ఫోర్లతో 50 పరుగులు చేసింది. నైట్ 28 పరుగులు చేసి ఔటైంది. మరోవైపు ధాటిగా ఆడిన వికెట్ కీపర్ జోన్స్ 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 40 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్‌కు ఐదు వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ స్మృతి మంధాన (52), వికెట్ కీపర్ రిచా ఘోష్ 47 (నాటౌట్)లు రాణించినా ఫలితం లేకుండా పోయింది. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో టీమిడియాకు ఓటమి తప్పలేదు.