Monday, December 23, 2024

న్యాయ వ్యవస్థ ఎదుర్కోగలదా!

- Advertisement -
- Advertisement -

కొలీజియం వ్యవస్థపై ప్రస్తుతం ప్రభుత్వం న్యాయ వ్యవస్థలు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరును కేవలం న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన వివాదంగా పరిగణించరాదు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధంకర్ చేసిన వ్యాఖ్యలు గాని, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న వ్యాఖ్యలను గాని పరిశీలిస్తే మొత్తం న్యాయ వ్యవస్థ ప్రభుత్వం విధానానికి అనుగుణంగా వ్యవహరించాలనే స్పష్టమైన దృక్కో ణం ఇమిడి ఉన్నట్లు అర్థం అవుతుంది. 1967 తర్వాత ఇందిరా గాంధీ న్యాయ వ్యవస్థ పట్ల అనుసరించిన అసహన ధోరణులు ఇప్పుడు మరో రూపంలో ప్రత్యక్షం అవుతున్నాయి. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంటే, రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చరాదని చెప్పడానికి న్యాయవ్యవస్థకు అధికారం ఎక్కడిది అన్నరీతిలో మాట్లాడిన జగ్దీప్ ధంకర్ సీనియర్ న్యాయవాది కావడం గమనార్హం. ఇవన్నీ వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు కాకపోవచ్చని, మొత్తం న్యాయ వ్యవస్థను పాదాక్రాంతం చేసుకోవడం కోసం జరుగుతున్న లోతయిన ప్రయత్నంలో భాగం కావచ్చని భావించవలసి ఉంటుంది.

1967లో గోలకనాథ్ కేసులో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా రాజ్యాంగాన్ని పార్లమెంట్ మార్చరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన్నప్పుడు ఇందిరా గాంధీ ఇదే విధంగా స్పందించారు. ఈ తీర్పును నిర్వీర్యం చేయడం కోసం ఆమె 1971లో 24 వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారు. తర్వాత రాజభరణాల రద్దును సుప్రీంకోర్టు కొట్టి వేస్తే, ఆ తీర్పును నిర్వీర్యం చేయడం కోసం పార్లమెంట్ 26వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది. న్యాయ వ్యవస్థ- ప్రభుత్వం మధ్య ఏర్పడిన ఈ పోరాటం చివరకు కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదని సుప్రీం తీర్పు ఇవ్వడంతో పతాక స్థాయికి చేరుకొంది. ఈ తీర్పుకు అనుకూలంగా ఏడుగురు న్యాయమూర్తులు ఉంటే, అదే బెంచ్‌లోని మరో ఆరుగురు వ్యతిరేకించడం గమనార్హం. కేవలం ఒక న్యాయమూర్తి ఆధిక్యతతో ఈ తీర్పు వెలువడింది.

దానితో ఆగ్రహం చెందిన ఇందిరా గాంధీ మైనారిటీ తీర్పు ఇచ్చిన ఆరుగురు న్యాయమూర్తులతో సీనియర్ అయిన ఎఎన్ రేయ్ ని ప్రధాన న్యాయమూర్తిగా చేసింది. అందుకు నిరసనగా ఆయనకన్నా సీనియర్‌గా ఉన్న ముగ్గురు జెఎం షెలాల్, కెఎస్ హెగ్డే, గ్రోవర్ తమ పదవులకు రాజీనామా చేశారు. వారంతా మెజారిటీ తీర్పు ఇచ్చినవారు. ఒక విధంగా సుప్రీంకోర్టులో ఇటువంటి సంక్షోభం ఇప్పటి వరకు మరెప్పుడు ఏర్పడ లేదు. ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రజలు ఎన్నుకున్న సభ్యులున్న పార్లమెంట్ చేసిన చట్టాలను ఉద్యోగులుగా ఉన్న న్యాయమూర్తులు ఏ విధంగా కొట్టివేస్తారనే ప్రశ్నను లేవనెత్తారు. న్యాయ వ్యవస్థ పట్ల చెలరేగుతున్న తీవ్రమైన అసహనాన్ని ఈ ధోరణి వెల్లడిచేస్తుంది. అంతేకాదు, సుప్రీంకోర్టు భారత వ్యతిరేక శక్తులకు ఒక సాధనంగా మారుతున్నదని కొన్ని కేసులలో కేవలం ఇచ్చిన నోటీసుల ఆధారంగా వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.

ఈ సందర్భంగా ఒక ప్రాథమికమైన అంశాన్ని గుర్తుంచుకోవాలి. పార్లమెంట్ సభ్యుల మాదిరిగా న్యాయమూర్తులను ఎన్నిక ద్వారా కాకుండా, నియామకం ద్వారా నియమించడం వెనుకగల ఉద్దేశాన్ని గ్రహించాలి. పార్లమెంట్ సభ్యులు తిరిగి ఎన్నిక కావడం కోసం ‘ప్రజాకర్షక’ విధానాలు అవలంబించవలసి వస్తుంది. అందుకోసం దేశ ప్రయోజనాలు, చట్టబద్ధమైన అంశాలను సహితం ఖాతరు చేయలేని పరిస్థితులు కూడా నెలకొంటాయి.

కానీ, న్యాయమూర్తులు అటువంటి ఒత్తిడులు లేకుండా కేవలం రాజ్యాంగం ప్రాతిపదికన తీర్పులు ఇచ్చే విధంగా ఉండేందుకే వారి నియామక పద్ధతులను రూపొందించారు. ఇక్కడ మరో అంశాన్ని గుర్తెరగాలి. పార్లమెంట్ రాజ్యాంగాన్ని రూపొందించలేదు. అందుకనే రాజ్యాంగంలోని మౌలిక అంశాలను మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదనే అభిప్రాయం ఏర్పడుతున్నది. అసలు లిఖిత పూర్వక రాజ్యాంగం లేని బ్రిటన్ వంటి దేశాలలో సహితం ఇటువంటి వివాదాలు చెలరేగుతూ ఉండటం గమనార్హం. పార్లమెంట్, న్యాయ వ్యవస్థ, చట్ట సభలు -అన్ని రాజ్యాంగ సభ రూపొందించిన రాజ్యాంగం ద్వారా ఏర్పడినవి. అందుకనే ఇవన్నీ రాజ్యాంగం పరిధిలో వ్యవహరించాల్సి ఉంటుంది. కొలీజిలియం వ్యవస్థలో సంస్కరణలు అవసరమైతే ఏకాభిప్రాయం ద్వారా తీసుకురావచ్చు. కానీ అటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం తాము అనుకున్న విధంగా న్యాయ వ్యవస్థ నడచుకోవాలనే అసహన ధోరణులు పెరుగుతూ ఉండటం విచారకరం.

నేడు జనాకర్షణ రాజకీయాలకు, భావోద్వేగ రాజకీయాలకు పెద్ద పీట వేస్తున్న సమయంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకొంటున్నామనే స్పష్టమైన సంకేతం ఇవ్వడం ద్వారా న్యాయ వ్యవస్థ ప్రజా మద్దతు పొందగలగాలి. అందుకోసం తన పని తీరులో తానే విశేషమైన మార్పులు తీసుకు రావలసి ఉంటుంది. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమైన సంకేతం ఇవ్వగలగాలి. ఒక వార్తా కథనం కోసం వెళ్లి అరెస్ట్ అయిన కేరళ జర్నలిస్ట్ సిద్దిఖ్ కప్పన్ బయటకు రావడానికి రెండేళ్లు పట్టింది. కానీ అర్ణబ్ గోస్వామి కేవలం 24 గం.లో సుప్రీంకోర్టు నుండి విడుదల కాగలిగారు. అంటే, వ్యక్తులను బట్టి అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తుందా? రాజ్యాంగ పరమైన అంశాలకు అనువుగా స్పందిస్తుందా? సాధారణ ప్రజలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కొలీజియం విషయంలో అస్పష్టత ఏర్పడడానికి సహితం సుప్రీంకోర్టు దృఢంగా వ్యవహరింపక పోవడమే కారణంగా చెప్పాలి. ఈ విషయంలో పారదర్శకత లోపించడం సహితం పలు అనుమానాలకు కారణం అవుతున్నది. న్యాయమూర్తులను ఎంపిక చేయడానికి, ఎంపిక చేయలేక పోవడానికి దారి తీసిన అంశాలను అందరికీ అందుబాటులో ఉంచితే ఇటువంటి సమస్యలు తలెత్తవు. కొలీజియం సిఫార్సు చేసిన పేర్ల పట్ల ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. కానీ ఆ అభ్యంతరాలను కొలీజియం ఏకగ్రీవంగా తిరస్కరిస్తే ఆయా పేర్లను పెండింగ్‌లో ఉంచే అధికారం ప్రభుత్వానికి లేదు. కానీ నెలల తరబడి అటువంటి పేర్లను పెండింగ్‌లో ఉంచడం జరుగుతుంది. ఈ విషయమై కేంద్ర న్యాయ కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ నేరం మోపాలని ఓ మాజీ ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే న్యాయ కార్యదర్శి కేవలం ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తారు. అందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రినే బాధ్యునిగా చేయాలి.
రాజ్యాంగ మౌలిక స్వరూపం కాపాడటం సుప్రీంకోర్టు ప్రధాన విధులలో ఒకటి. కానీ ఈ విషయంలో అంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు కనబడటం లేదు. రాజ్యాంగపరంగా కీలకమైన పలు కేసుల విచారణ విషయంలో తగు ప్రాధాన్యత లభించడం లేదు. ఉదాహరణకు రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకికత్వంలను ఎమర్జెన్సీ సమయంలో జత చేశారు. ఆ తర్వాత, రాజకీయ పార్టీలు తమ రిజిస్ట్రేషన్ కొనసాగాలంటే ఆ రెండింటి పట్ల తమ ఆమోదం తెలపాలని చట్టం తీసుకు వచ్చారు.

ఈ దేశంలో ఈ రెండు పదాల పట్ల పలు రాజకీయ పార్టీలు అభ్యంతరాలున్నాయి. అయితే ఏ పార్టీ కూడా వీటిని న్యాయస్థానంలో సవాలు చేయలేదు. కేవలం 1991లో స్వతంత్ర పార్టీ మహారాష్ట్ర శాఖ ఆ రెండు పదాలు రాజ్యాంగం మౌలిక స్వరూ పం కిందకు రావని, ఆర్ధిక, సామాజిక అంశాలని అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముంబై హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసింది. పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు ఇప్పటికే మృతి చెందారు. కానీ ఆ పిటిషన్ మాత్రం విచారణకు రాలేదు. అదే విధంగా జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370రద్దు చేసిన విధానం, మన ఎన్నికల వ్యవస్థనే అవినీతిమయం కావించేందుకు దోహదపడే ఎలక్టోరల్ బాండ్స్ వంటి పలు అంశాలపై దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు సుదీర్ఘకాలం తీసుకోవడం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు పొందుతున్న తీరు సహితం న్యాయ వ్యవస్థ నిజాయితీని శంకించే విధంగా చేస్తుంది.

సీనియర్ బిజెపి నాయకుడు, ప్రముఖ న్యాయవాది అరుణ్ జైట్లీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదవీ విరమణ అనంతరం చేపట్టే పదవులు, విరమణకు ముందు ఇచ్చే తీర్పులను ప్రభావితం చేస్తాయని పార్లమెంట్‌లోనే చెప్పారు. ఇటీవలకాలంలో ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులతో సహా ముగ్గురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన ఐదు వారాలలోగా కీలకమైన నామినేటెడ్ పదవులు పొందారు. ఇద్దరు గవర్నర్‌లుగా నియమితులు కాగా, మరొకరు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే ఈ సంస్కృతిని ప్రస్తుత ప్రభుత్వమే ప్రారంభించిందని చెప్పలేము. గతంలో కాంగ్రెస్ హయాంలో రంగనాథ్ మిశ్రా వంటి వారు నామినేటెడ్ పదవులు పొందడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీలో సహితం కీలక పాత్రలు పోషించారు. న్యాయ వ్యవస్థ పట్ల సాధారణ ప్రజల్లో ఇటువంటి నియామకాలు విశ్వాసాన్ని పెంపొందింప లేవు. రాజ్యాంగ పరిరక్షణ పట్ల, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడే విషయంలో తమ నిబద్ధతను ప్రదర్శించుకునే విధంగా న్యాయమూర్తులు క్రియాశీలకంగా వ్యవహరించాలి.

ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి కీలకమైన సూచన చేశారు. న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ప్రభుత్వంలో కీలకమైన పదవులలో ఉన్నవారు వ్యాఖ్య లు చేస్తున్నప్పుడు ఉద్యోగ విరమణ చేసిన న్యాయమూర్తులు కనీసం ఓ 50 మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాజ్యాంగంలోని అంశాలను వివరిస్తూ ప్రకటన చేసి ఉంటే ప్రజలకు వాస్తవాలు చేరే అవకాశం ఉంటుందని సూచించారు. అయితే ఐదారు మంత్రులు తప్ప ఉద్యోగ విరమణ చేసిన న్యాయమూర్తులు వేర్వే రు పదవులకు లేదా వ్యాపకాలు పరిమితమై న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడి గురించి పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. న్యాయ వ్యవస్థ, పార్లమెంట్ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ – తమ తమ పరిధులలో, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మన ప్రజాస్వామ్య మౌలిక స్వరూపాన్నే సవాలు చేసినట్లు కాగలదు.

 

* చలసాని నరేంద్ర 9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News