Saturday, November 23, 2024

తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంఎల్‌సి కౌశిక్ రెడ్డికి నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకున్న కమీషన్ ఆయనకు ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న ఢిల్లీలోని కమీషన్ కార్యాలయం ముందు హాజరుకావాలని ఆదేశించింది. తెలంగాణలో బిఆర్‌ఎస్ సర్కార్‌కు, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చెసిన్ బిల్లుల ఫైళ్లను ఇప్పటిదాకా గవర్నర్ ఎందుకు క్లియర్ చేయడం లేదంటూ ప్రశ్నించే క్రమంలో కౌశిక్ రెడ్డి అనుచిత పదజాలాన్ని వినియోగించారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బిజెపి శ్రేణులు కొన్నిచోట్ల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి కూడా కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అలాగే కౌశిక్ రెడ్డిపై గత నెల 28న బిసి పొలిటికల్ జెఎసి రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌పై కౌశిక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనను బర్తరఫ్ చేయాలని బిసి పొలిటికల్ జెఎసి నేతలు కోరారు. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసేలా డిజిపికి అదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా కౌశిక్ రెడ్డి రాజ్యాంగ పదవిని అగౌరవ పరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News