Monday, December 23, 2024

46 వేలు దాటిన భూకంప మరణాలు

- Advertisement -
- Advertisement -

అంకారా: టర్కీ, సిరియాల్లో 12 రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 46,000 దాటింది. భారీ భూకంపం ధాటికి లక్షలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయిన నేపథ్యంలో శిథిలాలను పూర్తిగా తొలగించే నాటికి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క టర్కీలోనే 3 లక్షలకు పైగా భవనాలు ధ్వంసమయినట్లు అంచనా. సహాయక బృందాలు శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు టర్కీలో 40,402 మంది మృతి చెందగా, సిరియాలో 5,800 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది జాడ తెలియడం లేదు. అడపాదడపా ఇప్పటికీ శిథిలాల కిందినుంచి ఒకరిద్దరు మృత్యుంజయులు ప్రాణాలతో బయటపడినప్పటికీ భూకంపం సంభవించి దాదాపు 300 గంటలు గడిచిపోయినందున శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎఎఫ్‌ఎడి)హెడ్ యూనస్ సెజర్ తెలిపారు.

దీంతో సహాయక చర్యలను చాలావరకు ఆదివారం రాత్రితో ముగించనున్నట్లు వెల్లడించారు. భూకంపం వల్ల 11 ప్రావిన్స్‌లో నష్ట సంభవించగా, దానిలో అదనా, కిలిస్, సనిలుర్బా ప్రావిన్స్‌లో ఇప్పటికే రెస్కూ ఆపరేషన్ ముగిసినట్లు ఆయన తెలిపారు.
భూకంపం ధాటికి రెండు దేశాల భూభాగాల్లో వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. టర్కీలో 84,726 భవనాలు ధ్వంసమయినట్లు ఆ దేశ పర్యావరణ, పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి మూరత్ కురుమ్ తెలిపారు. దేశంలోని 10 ప్రావిన్స్‌లో ఈ నష్టం సంభవించినట్లు ఆయన చెప్పారు. వీటిలో కొన్ని పూర్తిగా ధ్వంసం కాగా, మరికొన్ని భారీగా దెబ్బ తిన్నాయన్నారు. కాగా మార్చిలో కొత్త భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు టర్కీ అధ్యక్షుడు ఎర్డగోన్ చెప్పారు. ఏడాదిలోగా వీటి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

రెండుగా చీలిపోయిన గ్రామం

కాగా భూకంపం కారణంగా హతాయ్ రాష్ట్రంలోని డెమిరికోప్రు అనే గ్రామం రెండుగా చీలిపోయింది. భూప్రకంపనల ధాటికి భారీగా పగుళ్లు వచ్చి ఇక్కడి ఇళ్లు భూమిలోపలికి 13 అడుగుల మేర కుంగిపోయాయి. ఈ కారణంగా భూకంపానికి ముందు రోడ్డుపక్కన కనిపించిన ఇళ్లు ఇప్పుడు మాయమయ్యాయి. 1000 మంది జనాభా ఉండే ఈ గ్రామంలో ఇళ్లన్నీ కుంగిపోయాయి. ఎటు చూసినా శిథిలాలు, నేలకూలిన చెట్లు, మురికి నీరే కనిపిస్తోంది. అయితే అదృష్టవశాత్తు గ్రామంలో ఎవరూ చనిపోలేదని, కొంతమందికి మాత్రం గాయాలయ్యాయని 42 ఏళ్ల మహిర్ కరటాస్ అనే వ్యక్తి చెప్పాడు. తన ఇల్లు నాలుగు మీటర్ల మేర కుంగిపోయిందని ఆయన తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News