న్యూస్‌డెస్క్: తమిళ సూపర్‌స్టార్ ధనుష్ తన తల్లిదండ్రులకు ఒక అపురూపమైన కానుకను అందచేశారు. రూ. 20 కోట్ల విలువైన ఒక విలాసవంతమైన భవనాన్ని తన తండ్రి కస్తూరిరాజా, తల్లి విజయలక్ష్మికి ఫిబ్రవరి 17న తన కొత్త చిత్రం సార్(తమిళంలో వాది) విడుదల సందర్భంగా బహుమతిగా అందచేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం ఉన్న పోయస్ గార్డెన్ ప్రాంతంలోనే ఈ బంగళా కూడా ఉంది. ధనుష్ మామగారు, సూపర్‌స్టార్ రజనీకాంత్ నివాసం కూడా ఇదే ప్రాంతంలో ఉంది.
ధనుష్ తన తల్లిదండ్రులకు ఇచ్చిన ఖరీదైన కానుకగా వార్తను నటుడు, దర్శకుడు, ధనుష్ అభిమాన సంఘం అధ్యక్షుడు సుబ్రమణ్యం శివ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ధనుష్ కొత్త ఇల్లు ఆలయంలో ఉండే పవిత్రతను తనకు కలుగచేసిందని, తన తల్లిదండ్రులకు స్వర్గం లాంటి ఇల్లును తన కష్టార్జితంతో ధనుజ్ నిర్మించి ఇచ్చాడని శివ తెలిపారు. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో మిమల్ని చూసి యువతరం స్ఫూర్తి పొందుతుందని ఆయన పేర్కొన్నారు.