బాక్సర్ నిఖత్ జరీన్‌కు 600 గజాల ఇంటి స్థలం కేటాయింపు
భూ పత్రాలను ఆమె తండ్రికి అందజేసిన క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
క్రీడాకారులకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన భూ పత్రాలను నిఖత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్‌కు రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సోమవారం నాడు రాష్ట్ర క్రీడా పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి అందజేశారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్న నిఖత్ జరీన్‌కు సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు 2 కోట్ల రూపాయల నగదు బహుమతి ఇప్పటికే అందించామన్నారు. త్వరలో గ్రూప్1 పోస్టు అయిన డిఎస్‌పి ఉద్యోగాన్ని నిఖత్ జరీన్‌కు అందజేస్తామన్నారు. ఆమె సూచనల మేరకు ఇంటి స్థలాన్ని ఆమె తండ్రి మహహ్మద్ జమీల్ అహ్మద్‌కు అందజేస్తున్నామంటూ తండ్రిని ఈ సందర్భంగా అభినందించారు. ఇప్పటికే క్రీడా శాఖ తరపున ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి ఈషా సింగ్‌కు కూడా ఇలాగే రూ.2 కోట్ల నగదుతో పాటు జుబ్లీహిల్స్‌లోని 600 గజాల ఇంటి స్థలం పత్రాలను అందించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. వీటితో పాటు పద్మశ్రీ కిన్నెర మొగలయ్యకు ఒక కోటి రూపయాల నగదుతో పాటు 600 గజాల విలువైన ఇంటి స్థలాన్ని అందజేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను ప్రొత్సహించడానికి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని, క్రీడలను ప్రోత్సహించడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి క్రీడా పాలసీని రూపొందించామన్నారు. క్రీడా పాలసీని వచ్చే కేబినెట్ సమావేశంలో అమోదం పొందేలా చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అలాగే క్రీడా రంగంలోనూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా మార్చనున్నామన్నారు.
అనంతరం నిఖత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ మాట్లాడుతూ బాక్సింగ్ క్రీడల్లో అత్యద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్న నిఖత్ జరీన్ ప్రతిభను గుర్తించి తెలంగాణ సిఎం కెసిఆర్ పిలిచి భోజనం పెట్టి అభినందించారన్నారు. అలాగే రెండు కోట్ల రూపాయల నగదు బహుమతితో పాటు హైదరాబాద్‌లోని ఎంతో విలువైన జూబ్లీహిల్స్ లో ఇంటి స్థలాన్ని కేటాయించినందుకు , డిఎస్‌పి స్టాయి ఉద్యోగాన్ని ఇచ్చి గౌరవిస్తున్నందుకు కృతజతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు కృతజ్ఞతలు తెలియజేశారు.