Monday, December 23, 2024

గ్లాండ్ ఫార్మా.. గ్రాండ్ విస్తరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతోంది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు చొరవతో రాష్ట్రానికి అనేక కంపెనీలు క్యూ కడుతున్నాయి. పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇందులో భాగంగా నగరంలోని జీనోమ్ వ్యాల్లీలో గ్లాండ్ ఫార్మా కంపెనీ సుమారు రూ. 400 కోట్లతో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సోమవారం మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పెట్టుపడుల రాకతో రాష్ట్రంలో మరో ఐదు వందల నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది.

ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రి కెటిఆర్‌తో ఫార్మా కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేనంతరం జీనోవ్ వ్యాలీలో పెట్టుబడులు పెడుతున్నట్లుగా గ్లాండ్ ఫార్మా కంపెనీ పేర్కొన్నది. కంపెనీ యజమాన్యం తీసుకున్న నిర్ణయంపై మంత్రి కెటిఆర్ స్వాగతిస్తూ….వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గ్లాండ్ ఫార్మా రావడం వల్ల రాష్ట్ర లైఫ్ సైన్సెస్ జీనోమ్ వ్యాలీల శక్తి మరింత బలోపేతమవుతోందన్నారు. బయోలాజికల్స్, బయోసిమిలర్, యాంటీబాడీస్,రీకాంబినెంట్ ఇన్సులిన్ వంటి అధునాతన రంగాలపై దృష్టి కేంద్రీకరించడానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయన్నారు.

రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం, సమర్ధవంతమైన నాయకత్వం ఉండడం వల్లే పెట్టుబడుదారులు స్వేచ్చగా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నదన్నారు. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందిస్తోందన్నారు. పైగా వారిపై ప్రభుత్వ పరంగా ఎలాంటి వేధింపులు కూడా లేకపోవడంతో పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ రాష్ట్రమే మొదటి ఛాయిస్‌గా నిలుస్తోందన్నారు. దీని కారణంగానే రాష్ట్రానికి అతి తక్కువ కాలంలోనే పెద్దఎత్తున పెట్టుబడులు రావడానికి ప్రధానంగా దోహదపడుతోందన్నారు. ఫలితంగా అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందన్నారు.

ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి గ్లాండ్ ఫార్మా నిరంతరం కృషి చేస్తోందని కెటిఆర్ అన్నారు. ప్రస్తుతం ఆ కంపెనీ భారతదేశంలో దాదాపు 1,000 మిలియన్ యూనిట్ల పూర్తి ఫార్ములేషన్ సామర్థ్యంతో ఎనిమిది తయారీ కేంద్రాలను నిర్వహిస్తోందన్నారు. కాగా ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శక్తి ఎం నాగప్పన్, గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ సదు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News