Tuesday, December 24, 2024

బిజెపిని భయపెడుతున్న తులసీదాస్

- Advertisement -
- Advertisement -

తులసీదాస్ రచన రామ చరిత మానస్‌లో వెనుకబడిన తరగతులు, మహి లు, దళితులను కించపరిచే భాగాలు, భావాలు ఉన్నట్లు సమాజవాది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య, అయోధ్య హనుమాన్ దేవాలయ పూజారి రాజు దాస్, అయోధ్య తపస్వి చావని మహంత్ పరమహంస దాస్ గురువారం నాడు దాడులకు పాల్పడినట్లు పరస్పరం కేసులు దాఖలు చేశారు. రామచరిత మానస్ గ్రంధంలోని వివాదాస్పద అంశాలపై లక్నోలోని ఒక హోటల్‌లో ఒక టివి ఛానల్ ఏర్పాటు చేసిన ఒక చర్చలో పాల్గొనేందుకు వారు వచ్చారు. చర్చ ముగిసిన తరువాత తాను హోటల్ నుంచి వెళుతుండగా మౌర్య, అతని అనుచరులు తన మీద దాడి చేసినట్లు రాజుదాస్ ఆరోపిస్తూ ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. పూజారి, మహంత్ తన మీద కత్తి, గొడ్డలితో దాడికి పాల్పడగా తన అనుచరుల కారణంగా తప్పించుకున్నానని ఆ మేరకు కేసు దాఖలు చేస్తున్నట్లు మౌర్య ప్రకటించారు. తనకు అదనపు రక్షణ కల్పించాలని కూడా పోలీసు కమిషనర్‌ను కోరారు. చర్చలో టివి యాంకర్ తన మీద దాడికి రెచ్చగొట్టినట్లు కూడా విమర్శించారు. అభ్యంతరకర భాగాలను రామచరిత మానస్ గ్రంధం నుంచి తొలగించాలి లేదా దాన్ని నిషేధించాలని మౌర్య కోరుతున్నారు. అలాంటి వాటిని తాము అంగీకరించేది లేదని సాధు, సంతులు చెబుతున్నారు.

మనువు చెప్పినట్లుగా బతకటానికి జనం సిద్ధంగా లేరు. ఆ బోధనలను బలవంతంగా అమలు జరిపే అవకాశమూ లేదు. ఇస్లాం మత ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో షరియాను అమలు జరిపేందుకు పూనుకున్న వారికి, మన దేశంలో మనుస్మృతిని రుద్దాలని చూసే వారికి పెద్ద తేడా లేదు. దేశంలో అనేక మంది రామాయణాన్ని తిరగ రాశారు. వాటిలో 16 శతాబ్ది నాటి తులసీదాన్ రచన ఒకటి. హిందీకి దగ్గరగా ఉండే అవధీ భాషలో రాసినందున జనానికి సులభంగా అర్ధం కావటంతో ప్రాచుర్యం పొందింది. తులసీదాస్ కలం నుంచి వెలువడిన రామ చరిత మానస్ గ్రంధంలోని మనుస్మృతిలో చెప్పిన అంశాలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో వివాదాన్ని రేపాయి. నల్లేరు మీద బండిలా తమ పథకాన్ని అమలు జరపాలని చూస్తున్న హిందూత్వ శక్తులకు ఇది మింగుడు పడక మండిపడుతున్నాయి. శాపాలు పెట్టే శక్తి లేకపోవటం లేదా పని చేయవని తెలిసి గానీ అభ్యంతర అంశాలను విమర్శించిన బీహార్ మంత్రి చంద్ర శేఖర్ నాలుక కోస్తారు. రూ. పది కోట్ల బహుమానం ఇస్తామని అయోధ్యకు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య ప్రకటించారు. స్వామి ప్రసాద్ మౌర్య తల నరికితే రూ. 21 లక్షలు ఇస్తానని హనుమాన్ గుడి పూజారి రాజు దాస్ ప్రకటించారు.

రామ చరిత మానస్, మనుస్మృతి, పురాణాలు, ఇతర గ్రంధాల్లో ఉన్న అవాంఛనీయ వర్ణనలు, బోధల గురించి దశాబ్దాల క్రితమే తెలుగునాట హేతువాదులు, నాస్తికవాదులు ఎత్తి చూపిన అంశం తెలిసిందే. ఇప్పుడు ఉత్తరాదిన అలాంటి పరిణామం జరుగుతోంది. నాడు ఆ విమర్శ, సమర్థనలు ఎన్నికలతో నిమిత్తం లేవు. ఇప్పుడు వాటితో మిళితం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బిసిలను కించపరిచే భాగాలను నిషేధిస్తామని స్వామి ప్రసాద్ చెప్పారు.
సమాజవాదీ ఎంఎల్‌ఏ ఆర్‌కె వర్మ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. దానిలో ‘తులసీదాస్ వివక్ష, అంటరానితనం, అసమానతను తలకు ఎక్కించుకున్న ఒక కవి. అతని రామ చరిత మానస్‌లో రాజ్యాంగానికి విరుద్ధమైన అనేక చరణాలున్నాయి. అవి వెనుబడిన తరగతులు, మహిళలు, దళితులు, సంత్ సమాజాన్ని అవమానిస్తున్నాయి. ఆ చరణాలను తొలగించాలి’ అని పేర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ బిజెపి యువమోర్చా వారు ఎంఎల్‌ఎ శవయాత్ర జరిపి బొమ్మను దగ్ధం చేశారు. రామ చరిత మానస్‌ను అవమానించినందుకు ఆర్‌జెడి, సమాజవాదీ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. హిందూ సమాజంలో అపనమ్మకాన్ని కలిగించేందుకు ఆ పార్టీల నేతలు చూస్తున్నారని ఆరోపించింది.

ఉత్తరాదిలో 120 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్, బీహార్‌లో తలెత్తిన ఈ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా పాకే అవకాశం ఉంది. మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికలపై దీని ప్రభావం పడుతుందేమో అని కంగారు పడుతున్న బిజెపి ఇతర సంస్థలు, సాధు సంతులను రంగంలోకి దింపి ఆచితూచి మాట్లాడుతున్నది. సున్నితమైన, మనోభావాలతో ముడిపడిన ఈ వివాదం పెరిగితే తన బిసి ఓటు బాంకుకు గండిపడుతుందన్న భయం దానిలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సంఘ పరివార్ సంస్థలకు చెందిన అగ్ర వర్ణాలుగా అనుకుంటున్న కులాలకు చెందిన వారు హిందూత్వ అజెండాను దెబ్బ తీసే ఈ పరిణామంపై మండిపడుతుండగా వారిని మాట్లాడవద్దని బిజెపి ఆదేశించినట్లు వార్తలు.

రామ చరిత మానస్‌లో తమను కులపరంగా కించపరిచినా తమకేమీ ఇబ్బంది లేదు అని చెప్పగల స్థితి లేనందున వెనుకబడిన తరగతుల నేతలు, మద్దతుదారులు నోరు మెదపలేని స్థితి ఏర్పడింది. వెనుకబడిన తరగతుల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ఆ జనాభా ఎంత అన్నది తాజా లెక్కలు లేవు. అందువలన కులపరమైన లెక్కలు తేల్చాలన్న డిమాండ్‌ను బిజెపి అంగీకరించటం లేదు. బీహార్‌లో గణాంకాల సేకరణకు ఆర్‌జెడి జెడి(యు) కూటమి నిర్ణయించటంతో ఉత్తరప్రదేశ్‌లో కూడా ఆ డిమాండ్‌కు మద్దతు పెరుగుతున్నది. దాని కోసం ఆందోళన ప్రారంభిస్తామని సమాజవాదీ పార్టీ ప్రకటించింది. రామ చరిత మానస్ వివాదం గురించి సిఎం యోగి ఆదిత్య నాథ్‌ను అడగ్గా వివాదం రేపే వారికి దాని గురించి తెలియదని, బిసి లెక్కల గురించి నిర్ణయించాల్సింది కేంద్రమని తప్పించుకున్నారు. 1980 దశకంలో ఉత్తరాదిన మండలమా, కమండలమా అన్న ప్రాతిపదికన ఓటర్లు చీలారు. మండల్ కమిషన్ నివేదికను సమర్ధించిన పార్టీలు ఒక వైపు బిజెపి మరో వైపు తారసిల్లాయి. తరువాత జరిగిన పరిణామాల్లో 2014 నాటికి ఎంబిసిలు బిజెపికి మద్దతు ఇచ్చారు. ఇప్పటికీ అదే కొనసాగుతున్నది. ఎంబిసిలు, కొందరు దళితులను ఆకట్టుకున్న బిజెపి మిగతా వారిని కూడా తన వైపు తిప్పుకొనేందుకు పూనుకున్నప్పటికీ అది జరగలేదు.

బిసి జనాభా గణనకు తిరస్కరించటంతో అనేక మంది బిజెపి మద్దతుదారుల్లో కూడా పునరాలోచన ప్రారంభమైన దశలో రామచరిత మానస్ వివాదం ముందుకు వచ్చింది. ఆ గ్రంధాన్ని లక్నో లో తగులబెట్టిన వారి మీద మీసాతో సహా ఇతర చట్టాల కింద మౌర్యతో సహా పది మందిపై బిజెపి సర్కార్ కేసులు పెట్టింది. ఈ వివాదం తలెత్తిన తరువాత సమాజవాదీ నేత అఖిలేష్ యాదవ్ తాను కూడా శూద్రుడనే అని అంటూ బిజెపి మీద అనేక ప్రశ్నలను సంధించారు. అసెంబ్లీలో సిఎం యోగి తులసీ దాస్ రచనలో ఉన్న వాటిని అనువదించి చదివి శూద్రులు ఎవరో తేల్చాలని సవాలు చేశారు. దళితులను శూద్రులుగా బిజెపి వారు పరిగణిస్తున్నారా లేక మమ్మల్ని బిసిలుగానూ దళితులను శూద్రులుగా పరిగణిస్తున్నారా అన్నది తేల్చాలి అన్నారు. ఇదిలా ఉండగా లక్నోలోని సమాజవాదీ ఆఫీసు సమీపంలో పెద్ద బోర్డు వెలసింది. ‘6,743 కులాలు, శూద్ర సమాజం గర్వంతో చెబుతున్నాం మేం శూద్రులం, జై శూద్ర సమాజం, జై రాజ్యాంగం’ అని దాని మీద రాసి ఉంది. దాన్ని ఆలిండియా కుర్మీ క్షత్రియ మహాసభ ( ముంబై) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శూద్ర ఉత్తవ్‌ు ప్రకాష్ సింగ్ పటేల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
పాము పాలు తాగితే విషంగా మారినట్లుగా దిగువ కులాల వారు విద్య నేర్చుకుంటే విష పూరితం అవుతారని దానిలో రాసినట్లు బీహార్ మంత్రి చంద్రశేఖర్ చెప్పారు.

సకల గుణ హీనుడైనా బ్రాహ్మణుడిని పూజించాలి, వేద ప్రవీణులైనా శూద్రులను గౌరవించకూడదని, తెలీ, కువ్‌ుహార్, కహార్, దళితులు, ఆదివాసీలు అధములని పేర్కొన్నట్లు కూడా చెప్పారు. మహిళలు, దళితుల గురించి తులసీదాస్ కించపరిచే విధంగా రాశారు, అవి ఒకటో రెండో వాక్యాలు కాదు అనేక చరణాలు రాశారు. ఒక దానిలో ఒక బ్రాహ్మణుడి నిండా చెడు లక్షణాలు ఉన్నా అతన్ని పూజించాలి. ఒక దళితుడు వేద పండితుడైనా అతన్ని గౌరవించకూడదు అని రాశారని, అంత వివక్షతో కూడిన వాటిని ఎలా అంగీకరించాలని జామియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హేమలత మహేశ్వర్ ప్రశ్నించారు. డోలు వాయించేవారు, నిరక్షరాస్యులు, మహిళలు, పశువులు, దళితులు దండనార్హులని రామ చరిత మానస్‌లో తులసీదాస్ చెప్పినట్లు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ 2018 ఆగస్టులో ఒక పోస్టులో పేర్కొన్న దాని మీద పెద్ద చర్చ జరిగింది. ఇది గృహ హింస చట్టం, ఎస్‌సి, ఎస్‌టి చట్టాలను ఉల్లంఘించాలని ప్రోత్సహించటం కిందికి రాదా అని కట్జూ ప్రశ్నించారు. దళితులు, ఒబిసిలను శూద్రులని వర్ణించటం పట్ల బిఎస్‌పి నాయకురాలు మాయావతి నిరసన తెలిపారు. సమాజవాదీ వారిని శూద్రులని అప్రతిష్టపాలు చేస్తున్నదా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదా అని ప్రశ్నించారు. వారిని ఓటు బాంకుగా పరిగణిస్తున్నదని విమర్శించారు.

తులసీ దాస్‌ను సమర్ధించే కొందరు విపరీత తెలివిని ప్రదర్శిస్తున్నారు. అతనేమీ సంస్కర్తకాదు, కనుక అతనిలో వివక్ష ఉంటుం ది. వివాదాస్పద అంశాలను అతను సృష్టించిన పాత్రలు చెప్పినవి తప్ప అతని స్వంత అభిప్రాయాలు కాదని వితండవాదం చేస్తున్నారు. అసందర్భంగా ప్రస్తావిస్తున్నారని, వాటి అసలు అర్ధం వారికి అవగతం కాలేదని చెబుతున్నారు. శూద్రులు లేదా బ్రాహ్మ లు అనేది చేసే పనులను బట్టి తప్ప పుట్టుకను బట్టి కాదని కొందరు చెబుతున్నారు. అలాంటి పరిగణన గతంలో ఉందో లేదు తెలీదు ఇప్పుడు ఉనికిలో లేదు. పుట్టుకతోనే కులం, మతం వస్తున్నది. ఆ మేరకు గౌరవ మర్యాదలు, హీనంగా చూడటం జరుగుతున్నది. మొత్తంగా చెప్పాలంటే నల్లేరు మీద బండిలా తమ హిందుత్వ అజెండాను అమలు జరపాలన్న కాషాయ దళాలను ఎదుర్కొనే శక్తులు సదరు హిందూత్వ భావజాలంలో ఉన్న అసంబద్ధతలనే ఆయుధాలు చేసుకుంటుంటే మింగా కక్కలేని స్థితిలో బిజెపి గిలగిల కొట్టుకుంటున్నది.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News