Thursday, September 19, 2024

ఎఎస్పి ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/నూగూరువెంకటాపురం/ఏటూరునాగారం: ఏటూరునాగారం ఎఎస్పి కార్యాలయంలో బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ కస్తూరుపాడు గ్రామానికి చెందిన మద్వి ఆడమా అలియాస్ కమలేష్, బీజాపూర్ జిల్లా ఊసూరుబ్లాక్ పూజారి కంకేర్ గ్రామానికి చెందిన సుంకరి నారాయణ, బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ పూజారి కంకేర్ గ్రామానికి చెందిన సుంకరి సుధాకర్‌లు ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులు ఎఎస్పి సంకీర్త్ ఎదుట బుధవారం లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. ఈసందర్భంగా ఎఎస్పి సంకీర్త్ మాట్లాడుతూ.. మద్వి అడమా అలియాస్ కమలేష్ 2012లో చర్ల, శబరి ఏరియా కమిటీ కార్యదర్శి శారద నేతృత్వంలో జన నాట్యమండలి సభ్యునిగా చేరాడని తెలిపారు.

2015లో ఆరుగురు సభ్యుల బృందంతో జన నాట్య మండలి కమాండర్ అయ్యాడని తెలిపారు. మావోయిస్టు పార్టీ కోసం 11 సంవత్సరాలు పనిచేసినట్లు తెలిపారు. సుంకరి నారాయణ 2009లో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ నాయకత్వంలో మిలీషియా సభ్యునిగా తన కార్యకలాపాలను కొనసాగిస్తూ 14 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడని తెలిపారు. సుంకరి సుధాకర్ 2020లో జంగిల్ కమిటీ సభ్యునిగా చేరి అప్పటి నుండి నేటి వరకు మావోయిస్టు పార్టీ కోసం పనిచేశాడని తెలిపారు. కాగా మావోయిస్టు భావాజాలంతో నిరాసక్తత, వారి ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు మావోయిస్టులు అడ్డుకొని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుండడంతో లొంగిపోవాలని నిర్ణయించుకొని ముగ్గురు మిలీషియా సభ్యులు లొంగిపోయినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో వెంకటాపురం ఎస్సై తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News