Saturday, December 21, 2024

మళ్లీ మళ్లీ బెదిరిస్తున్నారు: ఎంఎల్‌ఎ రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తనకు ప్రాణహాని ఉందని, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బిజెపి గోషామహాల్ ఎంఎల్‌ఎ రాజా సింగ్ డిజిపి అంజనీకుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఆయన డిజిపి అంజనీకుమార్‌కు లేఖ రాశారు. గత కొన్ని నెలల నుంచి ఇలాంటి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయం పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తనతో పాటు, తన కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఆగంతకులు చెబుతున్నారని, రోజువారీ కార్యకలాపాలు గురించి చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని త్వరలో నీ అంతు చూస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని సదరు లేఖలో పేర్కొన్నారు.

ఆగంతకులు ఉపయోగిస్తున్న ఫోన్ నెంబర్లు, సందేశాలను పంపించారు. తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని రాజాసింగ్ అన్నారు. గన్ లైసెన్స్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నా గతంలో నేరచరిత్ర ఉందని నిరాకరిస్తున్నారన్నారు. ఎంతో మంది నేరస్థులకు సైతం గన్ లైసెన్సులు ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. కాగా, తన ట్విట్టర్ వేదికగా… తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ ఇటీవల పోస్ట్ చేశారు. చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ట్వీట్ చేశారు. తనను చంపుతానని ఓ పాకిస్థానీ వాట్సాప్ కాల్‌లో బెదిరించినట్లు ఆవేదన చెందారు.

ఇస్లాం మతాన్ని కించపరుస్తున్నందుకు తన గొంతు కోస్తామని బెదిరించినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తరచూ ఇలాంటి కాల్స్, మెసేజ్‌లు వస్తుంటాయని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News