జైన, బౌద్ధ ధర్మాల గురించిన సమాచారం మనకు చాలానే అందింది. కానీ, చార్వాకుల వివరాలూ, వారి సాహిత్యం ఎందుకు అందలేదూ? అంటే వైదిక ధర్మ ప్రబోధకులు పని గట్టుకొని ఆ సాహిత్యాన్ని ఆనవాళ్ళు లేకుండా నాశనం చేశారు. కాబట్టి! మరి, ఈ మాత్రం కొన్ని విషయాలయినా మనకు ఎలా అందాయీ? అంటే చార్వాక/ లోకాయతలను తీవ్రంగా ఖండించిన వైదికుల రచనల నుండి కొన్ని విషయాలు అందాయి. అంటే చార్వాక విరోధుల నుండి కొన్ని సంగతులు బయటికి వచ్చాయి. చార్వాక విరోధులు ఏయే విషయాలలో చార్వాకులతో విభేదించారో వారు రాసినప్పుడు, చార్వాకుల ఆలోచనలు కొన్ని మనకు తెలిశాయి.
హేతువాద దృక్పథంతో చూసినప్పుడు, చార్వాకులు వాస్తవాలు మాట్లాడుతున్నారనీ, ఈ విభేదించే వైదిక రచయితలు, ఆర్య సమాజికులు అడ్డదిడ్డంగా వాదిస్తున్నారనీ మనకు అనిపిస్తుంది. ఉదాహరణకు దయానంద సరస్వతి తన ‘సత్యార్థ ప్రకాశ్’లో వేదాలను చార్వాకులు తిరస్కరించారని చెపుతూ “వేద విద్య లేకపోతే అవిద్య విస్తరిస్తుంది” అని అన్నాడు. ఒప్పుకుందామా? అలాగే తల్లిదండ్రుల కలయికతోనే సంతానం కలుగుతుందని చార్వాకులు చెప్పింది నిజమే కానీ, తొలి మానవుడు ఎలా పుట్టాడు? ఈ విషయం చార్వాకులు ఎందుకు గ్రహించలేదు అని ప్రశ్నించాడు. ఇలా చార్వాకులు విరోధుల నుండే చార్వాకుల ఆలోచనలు మనకు అందాయి.
చార్వాక ఆలోచనా విధానాన్ని గురువైన బృహస్పతి బహుళ ప్రచారంలోకి తెచ్చాడని దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాశ్‌లో రాశాడు. సాధారణ శకానికి చాలా ముందు బృహస్పతి అనేక నియమాలు రాశాడు. వ్యవసాయం ఎలా చేయాలి? వ్యాపారం ఎలా చేయాలి? సరుకుల మార్పిడి ఎలా జరగాలి? వంటి నాటి నిత్య జీవితానికి అవసరమైన పలు అంశాల గూర్చి రాశాడు. ఇవే కాకుండా పరిపాలకుడైన రాజుకు ఏయే అక్షణాలు వుండాలో కూడా రాశాడు. ఆ కాలంలో పద్దెనిమిది గణ రాజ్యాలుండేవి. ప్రతి గణానికీ ఒక ఈశుడు (రాజు అధిపతి) వుండేవాడు. గణానికి అధిపతే గణాధిపతి. గణానికి ఈశుడెవరో అతడే గణేశుడు. అంతేకాని, వైదిక ధర్మకర్తలు కల్పించిన ఏనుగు తొండంతో వుండే గణపతి కాదు. అది తొండి గణపతి. ఆ కాలంలో వున్న గణపతికి అర్థాలు మార్చి పిట్టకథలు ప్రచారం చేశారు కాబట్టి, అది తొండి అనే కదా అనుకోవాలి? గణానికి ఈశుడైన వాడికి ఏ లక్షణాలు వుండాలో బృహస్పతి ఇలా రాశాడు “భూమిని తల్లిగా భావించేవాడు ప్రజల సుఖాలు చూసేవాడు రక్షించగల బలిశాలి సమస్యల్ని పరిష్కరించే బుద్ధిశాలి స్త్రీలపై చూపు పడని వాడు” ఈ విషయాలన్నీ 5 వేల సంవత్సరాల క్రితం చెప్పినవి.
ఆ తర్వాత చాలా కాలానికి చాణుక్యుడు ఈ అంశాలన్నింటినీ చేర్చి అర్థశాస్త్రం ప్రకటించాడు. చార్వాకుల గురువైన బృహస్పతి పేరును తొక్కిపెట్టి, బ్రహ్మణార్యుడైన చాణుక్యుడికి, అతని అర్థ శాస్త్రానికీ ప్రాచుర్యం కల్పించుకున్నారు. చార్వాక సామిత్యం విరివిగా లభించలేదు. కాని, ప్రపంచానికి భౌతికవాదం గురించి చెప్పిన తొలి తార్కికవాదాలు వారే. వారిని మనం భౌతికవాదులు, దేహవాదులు, తర్కవాదులు, నాస్తికులు వంటి పేర్లతో పిలుచుకోవచ్చు. మన దేశ సంపదను మనమే నాశనం చేసుకొని, కొన్ని వేల ఏళ్ళ నుండి మనువాదుల ప్రభావంలో పడి, భ్రమల్ని నమ్ముతూ, మూఢ నమ్మకాల్ని నమ్ముతూ, దుష్ట సంప్రదాయాలను ఆచరిస్తూ జీవితం దుర్భరం చేసుకుంటున్నాం. ఇదే పరిస్థితి యూరోపు దేశాలలో కూడా వచ్చింది. అక్కడి మత న్యాయ స్థానాలు హేతువాదుల్ని, తర్క వాదుల్ని, తాత్వికుల్ని, శాస్త్రజ్ఞుల్ని, నిర్దాక్షిణ్యంగా చంపేశారు. మత ఛాందసుల అఘాయిత్యాలు చెప్పనలవి కానంతగా అక్కడ జరిగాయి. నిజమే! కాని, అక్కడి వారు తమ ఆలోచనా ధోరణిని మార్చుకొని భౌతికవాదులకు, శాస్త్రజ్ఞులకు అడ్డుపడడం తగ్గించారు. ఫలితంగా ఆ దేశాలు వైజ్ఞానిక ప్రగతిని సాధించాయి. మన దేశంలో హేతువాదుల్ని ఇప్పటికీ చంపుతూనే వున్నారు. అందుకే ఇక్కడ ప్రగతి లేదు. 17వ శతాబ్దం నుండి యూరోపు దేశాలు సాధించిన వైజ్ఞానిక పరిశోధనా ఫలితాల్ని మన దేశం కూడా అనుభవిస్తూనే వుంది. అయినా సిగ్గు లేకుండా “అవన్నీ మా పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారని” కొందరు గొప్పలు చెప్పుకొంటున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. గుండె మీద వేయి వేసుకొని, నిజాయితీగా ఆలోచిస్తే దేశంలో జరుగుతున్న దేమిటో అర్థమవుతుంది.
భౌతికవాదులు ఎప్పుడూ తాము చూడని, తమకు అనుభవంలోకి రాని విషయాల్ని నిర్దంద్వంగా తిరస్కరించారు. ఉదాహరణకు దేవుడు, దయ్యం, స్వర్గం, నరకం, కర్మ, ఆత్మ, పునజన్మ వంటి వాటికి ఎప్పుడూ ఎక్కడా ఆధారాలు లేవు. ఇలా ఆధారాలు లేని వాటిని లోకాయతులు, చార్వాకులు అసలు పరిగణనలోకి తీసుకోరు. చార్వాకులు స్పృహను స్పృహగా మాత్రమే గుర్తించారు. దాన్ని “చైతన్య విశిష్ట దేహావ ఆత్మ” గా పరిగణించారు. పురుషార్థకామమోక్ష పురుషార్థాలు నాలుగు అని వైదిక ధర్మం చెపుతోంది. ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో అర్థ, కామ అనే రెంటిని మాత్రమే చార్వాకులు ఒప్పుకొన్నారు. ధర్మ, మోక్షాలను పూర్తిగా తిరస్కరించారు. ఎందుకంటే ఆ రెండు పూజారుల, పురోహితుల, బ్రాహ్మణుల పొట్ట కూటి కోసం జనాన్ని మోసం చేసి దోచుకోవడం కోసం కల్పించినవని తేల్చి చెప్పారు. కామ, అర్థలను ఒప్పుకొన్నారు. ఎందుకంటే మనిషికి కోరికలు (కామ) వుంటాయి. అవి తీరాలంటే ధనం, సంపద (అర్థ) తప్పనిసరి. అందువల్ల వాటిని స్వీకరించారు. ధర్మానికి ఆధారం ధనమేనన్నారు.
మోక్షం సాధించాలంటే ధర్మ ప్రవర్తన అవసరమనీ బ్రాహ్మణార్యులు తమ జీవనానికి ఉపయోగపడే నీతి సూత్రాలు ప్రచారం చేశారు. కాబట్టి, చార్వాకులు వాటిని తిరస్కరించారు. అలాగే సంశయాత్మకంగా (skep ticism) వుండే వాటిని కూడా ఒప్పుకోలేదు. జ్ఞానమంతా దాదాపు అనుభవం నుంచి వచ్చిందే గనుక, లోకాయతులు దాన్ని తప్పక స్వీకరించారు. empiricism ను స్వీకరించారు. మనిషయినవాడు తన పురోగతని తను చూసుకోవాలి. తన ఆరోగ్యం తను కాపాడుకోవాలి. తను సంతోషంగా వున్నప్పుడే అతను ఇతరుల గురించి ఆలోచించగలడు. వారికి తగిన సహాయం చేయగలడు. కష్టాల్లో కుమిలిపోయే వాడు ఇతరుల గూర్చి ఆలోచించలేడు. ఇతరులకు ఏ సహాయమూ చేయలేడు. వ్యక్తిగతంగా ఎవరికి వారు వృద్దిలోకి వస్తే సమాజం కూడా అభివృద్ది అవుతుంది. జీవితంలో వెలుగు చీకట్ల వలె సంతోషంతో పాటు దుఃఖం కూడా వుంటుంది. భరించాల్సిందే దాన్ని అధిగమించాల్సిందే అన్నది చార్వాకుల సిద్ధాంతం.
వైద్య విద్యార్థులు ఇన్ని వందల సంవత్సరాలుగా మానవుల మృత దేహాల్ని కోసి అవయవ నిర్మాణం గురించి అధ్యయనం చేస్తున్నారు కదా? మరి ఎవరికీ ఎప్పుడూ ఆత్మ కనబడలేదు ఎందుకూ? పోనీ జీవించి వున్న వారికి ఆపరేషన్లు చేస్తున్నారు కదా! ఒక్కోసారి ఆపరేషన్ విఫలమై అక్కడే ఆ బల్ల మీదే కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. పోనీ అప్పుడైనా డాక్టర్లకు ఆత్మ కనబడాలి కదా? కనబడడం లేదు. ఎందుకంటే అలాంటిది ఏదీ లేదు కాబట్టి! ఇంత ప్రగతి సాధించిన తర్వాత కూడా కనిపెట్టలేని ఆత్మ ఇక లేనట్టే కదా? ఇదే విషయం సాధారణ శకానికి ముందు చార్వాకులు కేవలం తమ పరిశీలనతో, వివేకంతో ఆత్మలేదని చెప్పారు.
మరి వారు తెలివి గల వాళ్ళా? తెలివి లేని వాళ్ళా ఆలోచించుకోవాల్సింది మనమే! మనుషులకు ఆత్మ వుంటుందని అంటున్నారు కదా! “మరి కుక్క, గాడిద వంటి జంతువులకు కూడా ఆత్మ వుంటుందా? అవి కూడా జీవం వున్న ప్రాణులే కదా?” అని చార్వాకులు బ్రాహ్మణార్యుల్ని ఆనాడే ప్రశ్నించారు. సమాధానం చెప్పి ఒప్పించే తెలివి లేని ఆ మనువాదులు చార్వాకుల్ని దుష్టులని, ధూర్తులని ఈసడించుకున్నారు. అంతేకాదు, వారి ఆలోచనలు ముందు తరాలకు అందకుండా జాగ్రత్తపడ్డారు. తర్కవాదులు బలపడితే ధర్మ గురువుల దుకాణాలన్నీ మూతపడతాయి. వారి ఉనికికే ప్రమాదం అని గ్రహించి, చార్వాకుల్ని అన్ని రకాలుగా నాశనం చేశారు. అందువల్లనే చార్వాక సాహిత్యం మన దాకా రాలేదు. దాని స్థానంలో బ్రాహ్మణార్యులు తమ సాహిత్యం కుప్పలు తెప్పలుగా గుమ్మరించారు. జనాన్ని భ్రమల్లో, విశ్వాసాల్లో, కట్టుకథల్లో ముంచి జ్ఞానహీనులుగా తయారు చేశారు. అందుకే చూడండి.
దేశంలో ఇప్పటికీ జ్ఞానహీనుల సంఖ్యే ఎక్కువ. అజ్ఞానుల్ని, అమాయకుల్ని క్షమించవచ్చు. చదువు, స్థాయి, హోదా వుండ కూడా జ్ఞాన హీనులుగా ప్రవర్తించే వారిని ఏ మందాం? ఎలా మార్చుకుందాం? వైదిక మత ప్రబోధకుల ప్రసక్తి, బ్రాహ్మణార్యుల ప్రసక్తి రాగానే సమకాలీన సమాజంలో ఉన్నవారు ఉలిక్కిపడగూడదు. ఇక్కడ చర్చించేదంతా వేల ఏళ్ళ క్రితం జరిగిన అఘాయిత్యాల గురించి అందులోంచి ఇప్పటికీ బయటపడలేని అజ్ఞానుల గురించి మాత్రమే! మనుషులంతా ఒక్కటి అని వైజ్ఞానిక పరిశోధనలు తేల్చి చెప్పిన సత్యాన్ని పక్కన పెట్టి ఇంకా అగ్ర కులస్థులమని అహంభావంతో ప్రవర్తించే వారు వారి పంథాను మార్చుకుంటే బావుండు కదా? అని అనుకుంటాం. అణగారిన వర్గాల వారు కూడా న్యూనతా భావంతో కుంచించుకుపోగూడదని భావిస్తాం.
తప్పిస్తే, ఎవరి మీద ఏ ద్వేషమూ వెళ్లగక్కడం లేదు. మానవవాదులు మనుషులందరినీ సమానంగా ప్రేమిస్తారు. సమానంగా గౌరవిస్తారు. మనుషులందరూ వివేకవంతులై హేతువాద దృక్పథంతో ఆలోచిస్తే సామాజిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. పురాణాల పరిజ్ఞానంతో సమాజాన్ని ఇంకా శాసించాలని ప్రయత్నించే మూర్ఖులు వాటిని పక్కన పెట్టి, విజ్ఞాన శాస్త్రం, చరిత్ర వంటి లోక జ్ఞానం పెంచుకునే పుస్తకాలు చదవాలి. దేశంలో నాస్తిక కేంద్రం ఏర్పాటు చేసి, ప్రపంచ నాస్తిక సభలు నిర్వహించిన మహనీయుడు, తెలుగువాడు గోపరాజు రామచంద్రరావు (గోరా) ఎవరో, ఆయన నేపథ్యం ఏమిటో తెలుసుకుంటే, మన చదువుకున్న మూర్ఖుల కళ్ళు తెరుచుకునే అవకాశం వుంది. మరొక ముఖ్యమైన విషయం గమనించండి. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చరిత్రకారుడు కాకపోయినా, బాగా చదువుకున్నవాడు. జ్ఞాని. అందుకే ఆయన తన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ గ్రంథంలో చార్వాకుల ప్రసక్తి తెచ్చారు.
వారి తార్కిక వాదనకు ఆకర్షితుడై నిరీశ్వరవాదిగా మారి వుంటారు. ఆయన రూపకల్పన చేసిన ‘సైంటిఫిక్ టెంపర్’ అనే పదం కూడా చార్వాకుల ఆలోచనా ధోరణికి ప్రభావితుడై చేసి వుంటారు. ఆ స్పృహతోనే దేశం వైజ్ఞానిక దృక్పథంతోనే ముందుకు పోతుందని చెప్పి వుంటారు. ఈ దేశం చార్వాకుల ఆలోచనా విధానాన్ని అనుసరించి వుండి వుంటే, శీఘ్ర గతిన వైజ్ఞానికంగా ముందడుగు వేసి వుండేది విదేశీయుల పాలనలోకి పోకుండా వుండగలిగేది. ఇప్పుడు ఉట్టి మాటలకు పరిమితమైన ‘విశ్వ గురువు’ అనే మాట భారత దేశం నిజంగానే సార్థకం చేసుకొని వుండేది. మనం దారి తప్పినప్పుడు గమ్యం కూడా పక్కకు తప్పుకుంటుంది. ఆ విషయం ఇకనైనా గ్రహించుకోవాలి! చార్వాక/ బృహస్పతి దర్శనాల్ని పునరుద్ధరించుకోవాలి!!
డా. దేవరాజు మహారాజు