న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిఎ బిభవ్ కుమార్‌ను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు ప్రశ్నించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్‌ఎ) నిబ్బంధన కింద బిభవ్ కుమార్ వాంగ్మూలాన్ని ఇడి అధికారులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ పిఎ బిభవ్ కుమార్‌తోసహా కనీసం 36 మంది నిందితులు వేలాది కోట్ల రూపాయల ముడుపులు పుచ్చుకున్నారని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను చెరిపివేసేందుకు 170 సెల్‌ఫోన్లను ధ్వంసం చేశారని ఇడి తన చార్జిషీట్‌లో ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి బిభవ్ కుమార్‌ను ఇడి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు ఇడి రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది. మొత్తం తొమ్మిదిమంది నిందితును అరెస్టు చేసింది.