గుట్కా, పాన్ మసాలాల మధ్య ఆరోగ్య హానికారిత విషయంలో పెద్ద తేడా ఏమి లేదు. గుట్కాలో పొగాకు ఉంటుంది. పాన్ మసాలాలో ఉండదు. పొగ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని ఉందని, ఆ అలవాటును తగ్గించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2011లో పొగాకు ఉత్పత్తులపై ప్రచారాన్ని నిషేధించింది. చాలా రాష్ట్రాలు గుట్కా అమ్మకాల్ని కూడా నిషేధించాయి. ఈ నిషేధాల బారి నుండి తప్పించుకునేందుకు దొంగదారిలో పొగాకు ఉత్పత్తుల కంపెనీలు పాన్ మసాలాను సృష్టించాయి. ఇందులో టొబాకో, నికోటిన్ లాంటి పదార్థాలు లేవని, నోటిని శుద్ధి చేసుకొనేలా పోకల, యాలకుల మిశ్రమాన్ని వాడుతున్నామని కంపెనీలు ప్రభుత్వాన్ని నమ్మించి పాన్ మసాలా వ్యాపార ప్రకటనలకు అనుమతిని సాధించాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పాన్ మసాలాను ఆహార పదార్థాల జాబితాలో చేర్చింది.
పాన్ మసాలా వ్యాపార ప్రకటనల్లో ఈ ఉత్పత్తిలో టొబాకో, నికోటిన్ కలపలేదు అంటూనే మరో వైపు దీనిని నమలడం ఆరోగ్యానికి హానికరం అని కూడా ఉంటుంది. ఏది కలిపినా, కలపకున్నా ఆరోగ్యానికి హాని అనేదే ముఖ్యం. ఆ మాట మీద సిగరెట్ల మాదిరే వీటి ప్రచారాన్ని కూడా నిషేధించాలి.
పాన్ మసాలాలో పొగాకు కలవకున్నా దాని వాడకం ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందని ఎన్నో ఆరోగ్య పరిశోధక సంస్థలు చాలా కాలంగా చెబుతున్నాయి. పాన్ మసాలాలో పోక వక్కలు, పొడి సున్నం, కాచు, రుచి కోసం యాలకులు లాంటి మసాలా దినుసుల పలుకులు ఉంటాయి. అయితే సాంప్రదాయిక పోక చెక్కలు కూడా నోటి క్యాన్సర్‌కు కారణమవుతాయని వైద్య శాస్త్రజ్ఞులు అంటున్నారు. జంతువులపై పోక వక్కల ప్రయోగం వల్ల వాటి శరీరంలో అవి తీవ్ర ప్రభావం చూపెట్టాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలు చెబుతున్నాయి. పొగాకు లేకున్నా పాన్ మసాలా వాడకం ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే నోటి క్యాన్సర్ కు దారి తీస్తుందని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధక సంస్థ తెలిపింది. నోటి క్యాన్సర్ బాధితుల్లో 52 % వక్క పొడి తినేవారేనని ఆ సంస్థ నివేదికల్లో ఉంది.
పాన్ మసాలా వాడకం వల్ల మనుషుల ఊపిరితిత్తులు, కాలేయం, ఉదరం, మూత్రపిండాలు దెబ్బ తింటాయని 2015లో పబ్ మెడ్ అనే పరిశోధక సంస్థ తెలిపింది. పోక వక్కలు గ్రూప్ 1 రకపు క్యాన్సర్ కారకాలని పుణెకు చెందిన టాటా హాస్పిటల్ వైద్య బృందం చెప్పినట్లు 2016లో టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. పాన్ మసాలా ప్రతి అవయవాన్ని ధ్వంసం చేస్తుందని, దానిపై ప్రభుత్వం సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆహార నాణ్యతల నిగ్గుతీసే ప్రభుత్వ సంస్థ ఇంత హానికారక వస్తువును ‘ఆహార పదార్థాల’ జాబితాలో ఎలా చేర్చిందో అర్థం కాదు.నిషేధానికి గురైన పొగాకు పొడులు తయారు చేసే కంపెనీలన్నీ పాన్ మసాలా పేరుతో కొత్త అవతారమెత్తాయి. గతంలో గుట్కా ఉత్పత్తి చేసిన వ్యాపార కుటుంబాలే ఇలా కొత్త ముసుగుతో తమ లాభాల సామ్రాజ్యాన్ని కాపాడుకుంటున్నాయి. మార్కెట్ రీసర్చ్ సంస్థ ఇమ్రాక్ ప్రకారం గత ఏడాది పాన్ మసాలా అమ్మకాలు మన దేశంలో రూ. 41821 కోట్లు చేరాయి.
యువత దీని వ్యసనపరులు కావడంతో ఈ అమ్మకాలు ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. 52 % ఎక్సైజ్ డ్యూటీతో ప్రభుత్వాలకు కూడా మంచి ఆదాయమే ఉంటోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తయారీ కేంద్రాలు 24 గంటలు పని చేస్తూనే ఉంటాయి. భారీ ఇనుప గేట్లు, వాకి టాకీలతో చుట్టూ పహారా సిబ్బంది ఉండి ఎవరిని లోనికి అనుమతించరు. ఈ వ్యాపారంలో చేరిన కొద్ది కాలంలోనే కోట్లకు పడగెత్తడంతో కంపెనీ యజమానులు జీవనశైలి ఒక్కసారిగా మారిపోయిందని సాధారణ సిబ్బంది అంటారు. వారి పిల్లల జన్మదిన వేడుకలకు సెలబ్రెటీలు ఆహ్వానించే స్థాయికి ఎదిగిపోయారు. వాటికి అలవాటు పడుతున్న యువత రోజుకు రూ. వంద నుండి రెండు వందల దాకా వెచ్చిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలను కూడబెడుతున్న వ్యాపారాల్లో నేడు ఇదొకటి.
ఇప్పుడు వ్యాపార ప్రకటనల్లోనూ పాన్ మసాలా ఉత్పత్తిదారులే ముందున్నారు. పత్రికల్లో, టివి ప్రసారాల్లో వీటి సోది ఎక్కువే. టివి వార్తల ముఖ్య అంశాల పక్కన కొలువు తీరుతాయి. ఉత్సాహాన్ని రేకెత్తించే మాటలతో సినిమా తారలు పోటీపడి వీటి ప్రకటనల్లో నటిస్తున్నారు. ఈ ప్రకటనల చిత్రీకరణ భారీగా రుమేనియా, టర్కీ లాంటి దేశాల్లో జరుగుతున్నాయి. 2000 దశకంలో షమ్మీకపూర్‌తో మొదలైన పాన్ మసాలా ప్రకటన, ఆయన నిండైన గొంతు ఇంకా గుర్తుండే ఉంటుంది. క్రమంగా వీటి ప్రకటనల్లో ప్రముఖ తారాగణం చోటు చేసుకుంది. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారుక్ ఖాన్ ఇలా పెద్ద నటులు, కొందరు హీరోయిన్లు వీటిలో ఆదాయ మార్గాన్ని చూసుకుంటున్నారు. వీరంతా ఒక్కో ప్రకటనకు కనీసం రూ. 10 కోట్లు తీసుకుంటారు. నిజానికి ఆరోగ్యానికి హానికారకం అని చట్టబద్ధ హెచ్చరిక ఉన్న ఉత్పత్తుల ప్రచార ప్రకటనల్లో సెలబ్రెటీలు పాల్గొన వద్దని అడ్వర్‌టైజ్‌మెంట్ స్టాండర్డ్ కౌన్సిల్ నిబంధనలున్నాయి. వీటిని ఎవరూ లెక్క చేయడం లేదు. డబ్బు మీద ఆశతో ఈ నటులు ఉన్నతంగా బతకడానికి, విజయాలు సాధించడానికి, శత్రు దేశాన్ని ఎదుర్కోవడానికి అని మోసపూరిత, అబద్ధపు డైలాగులు చెబుతూ ఈ పొట్లాన్ని నోట్లో వేసుకున్నట్లు నటిస్తున్నారు. జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించిన హాలీవుడ్ నటుడు పియర్స్ బ్రాస్నాన్ ఒక పాన్ మసాలా యాడ్ లో నటించాడంటే వీరు ప్రచారానికి ఎంత వెచ్చిస్తున్నారో ఊహించవచ్చు. అయితే వారి హీరోయిజాన్ని ఆరాధించే అభిమానులకు వీరి మసాలా ప్రకటనలు నచ్చలేదు.
ప్రాణాంతక మిశ్రమాన్ని ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ ట్వీట్లు, కామెంట్ల ద్వారా తన నిరసనలను ప్రకటిస్తున్నారు. బ్రాస్నాన్ నటించిన ‘లైసెన్స్ టు కిల్’ అనే సినిమాతో అయన పాన్ మసాలా యాడ్‌ను పోల్చడంతో ఆ నటుడు ఈ ప్రకటనల్లోంచి తప్పుకున్నారు. నిరసన సెగకు అమితాబ్ బచ్చన్ కూడా తన 79వ జన్మదిన సందర్భంగా నవంబర్ 2021లో కమ్లా పసంద్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అక్షయ్ కుమార్ కూడా ఏప్రిల్ 2022 లో తన నిర్ణయాన్ని ట్వీట్ చేశారు. ‘వీటిలో నటించినందుకు విచారిస్తున్నాను, క్షమించండి, ఇకపై నటించకుండా ఇంతవరకు ఆ ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏదైనా ప్రజోపయోగ కార్యక్రమానికి వినియోగిస్తాను’ అని తెలిపారు. ఇప్పుడు కొత్త ముసుగులో ఈ ప్రకటనలు కనిపిస్తున్నాయి.
అను కపూర్ నటించిన ప్రకటనల్లో ముందు చెట్ల సంరక్షణ, నీటి వృధా నియంత్రణ, బాలికల భద్రత, మహిళా గౌరవం లాంటి గొప్ప సామాజిక ముచ్చట్లతో మొదలై చివరగా ఒక పాన్ మసాలా పరిచయం ఉంటుంది. అజయ్ దేవగన్ మాత్రం ఇది తన సొంత విషయం, నిజంగా ఆరోగ్యానికి హాని కలిగితే అమ్మకాలు నిలిపివేయాలి అని జవాబిచ్చాడు. ఏ నటుడు ఎలా సర్దుకున్నా పత్రికల్లో, టివిల్లో వారు నటించిన పాన్ మసాలా ప్రకటనల జోరు మాత్రం తగ్గలేదు. ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వాలు, ధనాకాంక్ష గల వ్యాపారవేత్తలు, అభిమానాన్ని దుర్వినియోగం చేసే సినిమా నటులు ఉన్న ఈ సమాజంలో ఎవరి జాగ్రత్తలు వారే తీసుకోవాలి తప్ప మరో దారి లేదు.
బి.నర్సన్, 9440128169