హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్(టిఎస్ ఎంసెట్) 2023 షెడ్యూల్‌ను హైదరాబాద్ జెఎన్‌టియు శుక్రవారం విడుదల చేసింది. పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 28న జెఎన్‌టియు విడుదల చేస్తుంది. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 3న మొదలవుతుంది. దరఖాస్తుల సమర్పణ గడువు లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 10న ముగుస్తుంది. లేట్ ఫీజుతో మే 2వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 14 మధ్యనే విద్యార్థులు తమ దరఖాస్తులలో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. రూ. 250 లేట్ ఫీజుతో ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. రూ. 500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 20 వరకు, రూ. 2,500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు పంపవచ్చు. రూ. 5,000 లేట్ ఫీజుతో మే 2 వరకు దరఖాస్తులు సబ్మిట్ చేయవచ్చు. ఏప్రిల్ 30 నుంచి అధికారిక వెబ్‌సైట్ నుంచి టిఎస్ ఎంసెట్ 2023 హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున జెఎన్‌టియు మే 7 నుంచి 11వ తేదీ వరకు ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్షలు జరుగుతాయి. ఇంజనీరింగ్ విభాగానికి మే 7, 9వ తేదీ మధ్య, అగ్రికల్చర్, మెడిసిన్‌కు మే 10, 11 తేదీల మధ్య పరీక్షలు జరుగుతాయి.