రాంచీ : జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ భయాలు ఎక్కువయ్యాయి. దీనితో రాష్ట్రంలోని బొకారో జిల్లాలో దాదాపు 4 వేల వరకూ కోళ్లు, బాతులను ఏరి చంపిపారేయడానికి రంగం సిద్ధం అయింది. బర్డ్‌ఫ్లూ సోకినట్లు అనుమానాలు తలెత్తితో వెంటనే అటువంటి పక్షులను ఏరిపారేయడానికి ఈ విధంగా పక్షులలో అంటువ్యాధిని అదుపులో పెట్టడానికి ప్రభుత్వ ఆదేశాలతో వెటర్నరీ శాఖ సిద్ధం అయింది. బొకారాలో ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలోని ఓ కోళ్ల పెంపకం కేంద్రంలో బర్డ్‌ఫ్లూ తొలుత సోకింది.
దీనితో వెనువెంటనే జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారని అధికారులు తెలిపారు. కోళ్ల పెంపకం కేంద్రంలోని నాణ్యమైన కోడిరకం కదక్‌నాథ్‌కు ఫ్లూ కారక హెచ్5ఎన్1 ఎవియన్ ఇంఫ్లూయెంజా వైరస్ సోకినట్లు తొలుత నిర్థారణ అయింది. దీనితో అక్కడ దాదాపు వేయి వరకూ కోళ్లు చనిపొయ్యాయి. వైరస్ సోకినట్లు గుర్తించిన 103 ఈ రకం కోళ్లను ఏరి చంపిపారేశారు. ఇప్పుడు దాదాపు 4వేల వరకూ కోళ్లను ఇతరాలను నిర్మూలించేందుకు రంగం సిద్ధం అవుతోంది.