Thursday, November 14, 2024

ఎవరు గెలిచినా ‘చరిత్రే’

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్: మహిళల టి20 ప్రపంచకప్ తుది సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా తలపడనుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే ఐదు సార్లు టి20 వరల్డ్‌కప్ ట్రోఫీలను గెలుచుకుంది. తాజాగా ఈసారి కూడా డబుల్ హ్యాట్రిక్ నమోదు చేయాలని తహతహలాడుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. తొలి ప్రయత్నంలోనే ట్రోఫీని సాధించి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. రెండు జట్లలో ఎవరూ గెలిచినా మహిళల క్రికెట్‌లో కొత్త రికార్డు ఆవిష్కృమవుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఒకసారి హ్యాట్రిక్ విజయాలను సాధించింది.

ఈసారి కూడా ప్రపంచకప్ గెలిస్తే డబుల్ హ్యాట్రిక్ సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తోంది. ఇక సౌతాఫ్రికా గెలిచినా నయా చరిత్ర నమోదవుతోంది. పురుషులతో పాటు మహిళల క్రికెట్‌లో కూడా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా వరల్డ్‌కప్ ట్రోఫీని సాధించలేదు. ఈసారి ట్రోఫీ సాధిస్తే వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరపడుతోంది. భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌పై గెలిచి సౌతాఫ్రికా తుది పోరుకు అర్హత సాధించాయి. రెండు జట్లు కూడా సెమీస్‌లో చివరి బంతి వరకు తీవ్రంగా పోరాడి విజయం సాధించాల్సి వచ్చింది. ఫైనల్లో మాత్రం అలాంటి పరిస్థితి రాకుండా మెరుగైన ప్రదర్శన చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

ఫేవరెట్‌గా ఆసీస్

మరోవైపు ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ వరల్డ్‌కప్‌లో ఒక్క ఓటమి కూడా చవిచూడకుండానే ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో పలు పెద్ద జట్లను అలవోకగా ఓడించింది. భారత్‌తో జరిగిన సెమీస్‌లో తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ సంచలన విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఓపెనర్లు అలీ హీలీ, బెథ్ మూనీ, కెప్టెన్ మెగ్ లానింగ్, అష్లే గార్డనర్, ఎలిసె పేరి, జెస్ జొనాసెన్, మెగాన్ షుట్, సదర్లాండ్ తదితరులతో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉంది. అంతేగాక పలుసార్లు ఫైనల్లో ఆడిన అనుభవం కూడా కంగారూలకు కలిసి వచ్చే అంశమే. ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకోవడం సౌతాఫ్రికా అంత తేలికేం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంచలనం కోసం..

ఇదిలావుంటే తొలిసారి ఫైనల్‌కు చేరిన సౌతాఫ్రికా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును ఓడించి తుది పోరుకు అర్హత సాధించడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సౌతాఫ్రికా బలంగానే ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు లౌరా వల్‌వర్డ్, టజ్మిన్ బ్రిట్స్‌లతో పాటు మరిజానె కాప్, నడైన్ క్లార్క, షబ్నమ్ ఇస్మాయిల్, అయబొంగా ఖాకా, కెప్టెన్ సునే లూస్ తదితరులతో జట్టు బలంగా కనిపిస్తోంది. సమష్టిగా రాణిస్తే ఆస్ట్రేలియాను ఓడించడం అసాధ్యమేమీ కాదనే చెప్పాలి. అంతేగాక ఇంగ్లండ్‌ను ఓడించిన రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతుండడంతో సౌతాఫ్రికా సంచలనం సృష్టించిన ఆశ్చర్యం లేదు.

జట్ల వివరాలు:

ఆస్ట్రేలియా: అలీసా హీలీ, బెథ్ మూనీ, మెగ్ లానింగ్ (కెప్టెన్), అష్లే గార్డ్‌నర్, గ్రేస్ హారిస్, ఎలిసే పేరి, తహిలా మెక్‌గ్రాత్, జార్జియా వెరెహామ్, జెస్ జొనాసెన్, మెగాన్ షుట్, డార్సి బ్రౌన్, సదర్లాండ్, అలనా కింగ్, హీథర్ గ్రాహమ్, కిమ్ గార్థ్.

సౌతాఫ్రికా: లౌరా వల్‌వర్డ్, తజ్మిన్ బ్రిట్స్, మరిజానె కాప్, చోల్ ట్రియాన్, నడైన్ డి క్లార్క్, సునె లూస్ (కెప్టెన్), అన్నెకా బోస్చ్, సినాలో జఫ్లా, షబ్నమ్ ఇస్మాయిల్, అయబొంగా ఖాకా, నాన్‌కులులెకో, మసబతా క్లాస్, లారా గుడాలి, డెల్మి టక్కర్, అన్నెరి డెర్క్‌సెన్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News