Saturday, December 21, 2024

ఉల్లిరైతు కంటనీరు!

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో 58ఏళ్ల ఒక ఉల్లి రైతుకు ఎదురైన కష్టాన్ని తలచుకుంటేనే గుండె బేజారెక్కుతుంది. దేశంలో రైతులు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో బతుకు తున్నారో, విష గుళిక మాదిరిగా ఆత్మహత్య అనునిత్యం వారి జేబులోనే ఎందుకు తిష్ఠ వేసుకొని ఉంటుందో ఈ ఉదంతం తెలియజేస్తుంది. రాజేంద్ర తుకారాం చవాన్ అనే ఈ రైతు సీతాకాల పంట సీజన్లో తాను పండించిన 512కిలోల ఉల్లిని 70కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి షోలాపూర్ మార్కెట్‌కు తీసుకువెళ్లగా అక్కడ కిలోకి రూపాయి మాత్రమే లభించింది. రవాణా తదితర చార్జీలు మినహాయించుకొని 2రూపాయలకు భవిష్యత్ తేదీ లో చెల్లించేలా ఒక చెక్కును చేతిలో పెట్టి పంపించారు.

అంటే 15 రోజుల తర్వాత నగదు అయ్యే చెక్కును అంతేసి పెద్ద మొత్తానికి రాసి ఇచ్చారన్నమాట! గత ఏడాది తాను పండించిన వుల్లి కేజీ 20రూపాయలకు అమ్ముడయిందని చెప్పుకొని ఆయన గొల్లుమన్నారు. రైతులు ఎన్ని ఆందోళనలు చేసినా వారి పంటకు మదుపు మేర కయినా ధర గిట్టుబాటు కావడంలేదని ఈ ఉదంతం మరోసారి చాటింది. ప్రధాని మోడీ తీసుకొచ్చిన మూడు కార్పొరేట్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-2021లో ఢిల్లీ సరిహ ద్దుల్లో వేలాది మంది రైతులు నిర్వహించిన చరిత్రాత్మక ఉద్యమం ఆచట్టాలను రద్దు చేయించడంలో విజయ వంతమైంది. అందులో 700మందికి పైగా రైతువీరులు మరణించారు. ఆ ఉద్యమ విజయభేరి ప్రపంచం నలుమూలలా మార్మోగింది. అటువంటి అనేక సంఘటిత పోరాటాలకు మార్గదర్శి అయింది. అయినా దేశంలో రైతుల శ్రమకు తగిన ప్రతి ఫలం ఇప్పటికీ దక్కకపోగా పండించిన పంట కనీసంగనైనా గిట్టుబాటు కావడంలేదు.

అదంతా పక్కనబెడితే అయిదు వందల కిలోల ఉల్లి కిలో రూపాయికి మాత్రమే అమ్ముడు పోవడమంటే రైతుల బతుకులతో మళ్ళీ మళ్ళీ ఆడుతున్న క్రూర పరిహాసమే కదా! ఈ నెల 17తేదీన పది బ్యాగ్‌ల ఉత్తమ శ్రేణి ఉల్లిని మార్కెట్‌కు తీసుకుపోగా అక్కడి వ్యాపార సంస్థ వాటిని నాసిరకం ఉల్లి అని చెప్పి కిలోకి రూపాయి వంతున మొత్తం ఖరీదును 512 రూపాయలుగా జమ కట్టారని అందులో లోడింగ్, రవాణా, కూలీల చార్జీలంటూ మినహాయించుకొని రూ 2.49 ఇవ్వ జూపి రూ.2కి చెక్కు యిచ్చారని రైతు చెప్పాడు. ఈయన తన ఉల్లిని మార్కెట్‌కు తీసుకుపోయిన సమయానికి ఖరీఫ్‌పంట ఇబ్బడి ముబ్బడిగా ముంచుకొచ్చిందని దానితో ధర పాతాళానికి పడిపోయిందని అంటున్నారు. ఎటువంటి అనూహ్య పరిస్థితులు దూసుకొచ్చినా కిలోకి 1రూపాయి చెల్లించడం లోని నిర్దయ చెప్పనలవి కానిది. తెలుగు రాష్ట్రాల్లో టమాటకు ధర పలుకని రోజుల్లో రైతులు కింటాళ్ల కొద్ది నేలపారబోసే దృశ్యాలు కంటికి కనిపిస్తాయి. డిసెంబర్‌లో రోజుకు 15000 క్వింటాళ్ళు వచ్చిన పంట ఇప్పుడు 30000 క్వింటాళ్లకు పెరిగిపోయిందని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా గోధుమ తదితర ధాన్యాల ధరలు అదుపులోకి వచ్చాయిగాని కూరగాయలధరలు పెరిగిపోతున్నాయని వార్తలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉల్లి ధరలు అనూహ్యంగా విజృంభి స్తున్నాయి. మహారాష్ట్రలో మాత్రం కళ్ళ ముందు పరుచుకొన్న హృదయవిదారక దృశ్యం యిలా వుంది. దేశంలోని రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ 2016లో వాగ్దానం చేశారు. అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఈ విషయంపైనే భారతీయ జనతా పార్టీని నిలదీసింది. వాస్తవానికి ఎన్‌డిఎ హయాంలో రైతు ఆదాయం దారుణంగా పడిపోయిందని ఆ సంస్థ చైర్మన్ సుఖ్ పాల్ సింగ్ అన్నారు. రైతు పండించే అన్ని పంటలకు కనీస మద్దతు ధరను ప్రభుత్వాలు నిర్ణయించాలి. వ్యాపారులు ఆ ధరను విధిగా చెల్లించి రైతు వద్ద నుంచి ఆ సరకును కొనుగోలు చేసేలా చూడాలి.

మార్కెట్లో పరిస్థితి అందుకు అనుకూలంగా లేనప్పుడు కేంద్ర ప్రభుత్వమే రైతు నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి తగిన సమయం వరకు తన వద్ద నిల్వ ఉంచాలి. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాధన్ మద్దతు ధరకిచ్చిన నిర్వచనం శాస్త్రీయంగా ఉంది. రైతు ఇంటిల్లిపాది పడిన శ్రమకు విలువ కట్టి దానిని ఇతర సాగు ఖర్చుల మొత్తానికి చేర్చి ఆ మొత్తంలో సగాన్ని కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించాలని స్వామినాధన్ కమిటీ సిఫారసు చేసింది. ఇది ఇంతవరకు సమగ్రంగా అమలుకు నోచుకోలేదు సరికదా దేశంలో పండే పంటల్లో కేవలం 23కే మద్దతు ధరను ప్రకటిస్తున్నారు.

మిగతా పంటలు ఏమైపోవాలి? మహారాష్ట్రలో రైతు చవాన్‌కి పట్టిన గతే వారికి పడుతుంది. ప్రధాని మోడీ ప్రభుత్వం రైతు రక్షణ బాధ్యతను పూర్తిగా వదులుకొనే ఆలోచనలో వుంది. మొత్తం వ్యవసాయరంగాన్ని చిన్న, మధ్యతరగతి రైతులను, వ్యవసాయ కార్మికులను గాలికి విడిచిపెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తున్నది. తద్వారా మన వ్యవసాయ క్షేత్రాలను కార్పొరేట్ శక్తుల కు అప్పగించి రైతు ఉసురు మరింతగా తీయాలని సంకల్పించింది. ఇందుకోసం ప్రభుత్వ పంపిణీ వ్యవస్థను రద్దు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత రైతులు తమ కనీస ప్రయోజనాలు కాపాడుకోడానికి అవసరమయిన కార్యాచరణను మళ్ళీ చేపట్టడమే శరణ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News