అర్హులైన పేదలకు ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు
జిఓ 58 కింద 20,685 ఇళ్లకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి
ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలి
కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పలు నిర్ణయాలు
అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలోని అర్హులైన పేదలకు ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ మంత్రి కెటిఆర్ అధ్యక్షతన సోమవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు, జీఓ 58, 59, సాదాబైనామా, నోటరీ పత్రాలు, ఎండోమెంట్, వక్ఫ్ భూములు తదితర అమలుకు సంబంధించిన అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి సి.హెచ్ మల్లారెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
2014 సంవత్సరంలో 1.25 లక్షల మంది లబ్ధిదారులకు…
ఈ సందర్భంగా మంత్రి కెటి రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఇళ్లు లేదా ఇళ్ల స్థలాల నిర్ణయం వల్ల కోటిమంది కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. 2014 సంవత్సరంలో 1.25 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామన్నారు. జిఓ 58 కింద 20,685 ఇళ్లకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని, ఇంటి స్థలాల పట్టాల జారీని వేగవంతం చేయాలని కెటిఆర్ అధికారులను ఆదేశించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కెటి రామారావు అధికారులకు సూచించారు. నోటరీ చేసిన పత్రాల గురించి ప్రస్తావిస్తూ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న కేసుల ప్రక్రియను, సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని ఆయన అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పేదలకు అనుకూలమైన విధానాన్ని తీసుకోవాలని, అర్హత ఉన్న అన్ని కేసులను త్వరగా పూర్తి చేయాలని సబ్ కమిటీ అధికారులకు సూచించింది.
ఈ ఏడాది మొత్తం 4 లక్షల మంది లబ్ధిదారులకు
ఇదే అంశపై ఈనెల 13న కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయిన విషయం తెలిసిందే. మరోమారు సోమవారం కూడా సబ్ కమిటీ భేటీ అయి పలు అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంది. 2023-, 24 వార్షిక బడ్జెట్‌లో సొంత స్థలాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.7,350 కోట్లను కేటాయించింది. కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. ఈ ఏడాది మొత్తం 4 లక్షల మంది లబ్ధిదారులకు సాయం అందించాలని నిర్ణయించగా, ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1,78,200 మందికి, పట్టణ ప్రాంతాల్లో 2,21,800 మంది చొప్పున సాయం అందించనున్నారు.