Thursday, January 23, 2025

హ్యాట్రిక్‌పై టీమిండియా కన్ను..

- Advertisement -
- Advertisement -

హ్యాట్రిక్‌పై టీమిండియా కన్ను
ఆస్ట్రేలియాకు పరీక్ష, నేటి నుంచి మూడో టెస్టు
ఇండోర్: ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్నటీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఇండోర్ వేదికగా బుధవారం నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఇదిలావుంటే ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియాకు ఈ టెస్టు చావోరేవోగా మారింది. సిరీస్‌ను డ్రాగా ముగించాలంటే ఇకపై జరిగే రెండు టెస్టులను గెలవక తప్పని పరిస్థితి జట్టుకు నెలకొంది. ఇలాంటి స్థితిలో కీలక ఆటగాళ్ల గాయాలు ఆస్ట్రేలియాను మరింత కలవరానికి గురిచేస్తోంది. స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, హాజిల్‌వుడ్‌లు గాయాలతో చివరి రెండు టెస్టులకు అందుబాటులో లేకుండా పోయారు. అంతేగాక వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా మూడో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇలా కీలక ఆటగాళ్లు లేకుండానే పోరుకు సిద్ధమైన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ సవాల్‌గా తయారైంది. అయితే స్టీవ్ స్మిత్ సారథ్యం జట్టుకు కలిసి వచ్చే అంశంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అతని కెప్టెన్సీలో కంగారూలు మెరుగైన ప్రదర్శన చేస్తారని వారు అభిప్రాయపడుతున్నారు.

జోరుమీదుంది..
మరోవైపు ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో గెలిచి సిరీస్‌లో తిరగులేని స్థితిలో ఉన్న భారత్‌కు ఈ మ్యాచ్‌లోనూ గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. సీనియర్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు జోరుమీదుండడం జట్టుకు సానుకూల పరిణామంగా చెప్పాలి. అశ్విన్, జడేజాల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎదురు నిలువలేక పోతున్నారు. ఇండోర్‌లోనూ వీరి నుంచి ప్రత్యర్థి టీమ్ బ్యాటర్లకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడమే దీనికి నిదర్శంగా చెప్పొచ్చు. అంతేగాక రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియాను బ్యాటింగ్ సమస్య వెంటాడింది. తాజాగా ఇండోర్‌లోనూ అదే భయం వెంటాడుతోంది. ఇదే సమయంలో భారత్‌ను కూడా బ్యాటింగ్ సమస్య ఇబ్బందులకు గురిచేస్తోంది. రెండో టెస్టులో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా భారత్ చెమటోడ్చాల్సి వచ్చింది. అంతేగాక తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఆలౌటైంది. ఈ పరిస్థితుల్లో మూడో టెస్టు టీమిండియా బ్యాటర్లకు కూడా కీలకంగా మారింది.

రాహుల్ ఈసారైనా
వరుస వైఫల్యాలు చవిచూస్తున్న ఓపెనర్ కెఎల్ రాహుల్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం లభిస్తుందా లేదా అనేది సందేహంగా మారింది. జట్టు యాజమాన్యం మాత్రం ఒక అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే వైస్ కెప్టెన్సీ పదవిని కోల్పోయిన రాహుల్ ఈ మ్యాచ్‌లోనూ విఫలమైతే జట్టులో స్థానం నిలుపుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితి ఎదురు కావొద్దంటే భారీ ఇన్నింగ్స్ ఆడడం తప్పించి మరో మార్గం రాహుల్‌కు లేకుండా పోయింది. మరోవైపు కొంతకాలంగా పరిమిత ఓవర్ల సిరీస్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించినా ఆశ్చర్యం లేదు.

అంతేగాక సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లికి కూడా మ్యాచ్ కీలకంగా మారింది. కొంతకాలంగా టెస్టుల్లో కోహ్లి తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా మళ్లీ ఫామ్‌ను అందుకోవాలని కోహ్లి భావిస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్, చటేశ్వర్ పుజారా, శ్రీకర్ భరత్ తదితరులు కూడా బ్యాట్‌కు పనిచెప్పక తప్పదు. అప్పుడే టీమిండియా బ్యాటింగ్ సమస్య తీరుతంది.

గెలిచి తీరాల్సిందే..
ఇదిలావుంటే వరుస ఓటములతో సతమతమవుతున్న ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. సిరీస్‌లో నిలువాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో కీలక ఆటగాళ్లందరూ సమష్టిగా రాణించక తప్పదు. కెప్టెన్ స్మిత్‌తో పాటు ఉస్మాన్ ఖ్వాజా, లబుషేన్, రెన్‌షా, హాండ్స్‌కొంబ్, అలెక్స్ కారే తదితరులు బ్యాట్‌ను ఝులిపించాలి. బౌలర్లు కూడా సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. అప్పుడే ఆస్ట్రేలియాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకుంటే హ్యాట్రిక్ ఓటమి తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News