కామారెడ్డి: జిల్లాలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం పరిసరాల్లో కెసిఆర్ మొక్కలు నాటారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొనే అవకాశం అందరికీ రాదని, తనకు తన ధర్మ పత్నితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి, ఆయన ధర్మపత్నికి, ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు తెలియచేశారు. సాయంత్రం 4.11 గంటలకు బాన్సువాడ పర్యటన ముగించుకున్న సిఎం కెసిఆర్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
కాగా, స్వామివారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి.ఈ కల్యాణ మహోత్సవంలో సిఎం దంపతుల వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపిలు సంతోష్‌కుమార్, బిబి పాటిల్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.