Monday, December 23, 2024

విజయప్రియ నిత్యానంద ఎవరు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తనకు తాను దేవుడినని చెప్పుకునే నిత్యానంద భారత్ నుంచి పారిపోయి ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్’ అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ నివసిస్తున్నాడు. అక్కడ ఆయనకు వేలాది భక్తులు కూడా ఉన్నారు. ఇటీవల ఆయన దేశ ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరై ప్రపంచ ప్రజలను ఆశ్చర్యపరిచారు. తమ మహిళా ప్రతినిధుల బృందం ఫోటోలను నిత్యానంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వారిలో విజయప్రియ నిత్యానంద అనే ప్రతినిధి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ(సిఈఎస్‌సిఆర్) నిర్వహించిన చర్చలో ప్రసంగించారు. హిందూ మతం మత గురువుకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హిందూ మతంలోని ప్రాచీన సంప్రదాయాలను పునరుద్ధరించినందుకు నిత్యానంద వేధింపులకు గురవుతున్నారని, ఆయనను భారత్‌లో నిషేధించారని అన్నారు.

నిత్యానంద తరఫున ఆయన ప్రతినిధిగా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస శాశ్వత రాయబారిగా తనను తాను ఐక్యరాజ్యసమితిలో పరిచయం చేసుకున్న విజయప్రియ నిత్యానంద చీర, తలపాగ, ఆభరణాలు ధరించి హాజరయ్యారు. ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్ ప్రకారం ఆమె వాషింగ్టన్ డిసిలో నివసిస్తున్నారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఆమె ఫోటోలలో కుడిచేతిపై నిత్యానంద పచ్చబొట్టు కనిపిస్తున్నాయి.

విజయప్రియ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొన్న దానిని బట్టి ఆమె మానిటోబా మైక్రోబయోలజీ యూనివర్శిటీ నుంచి బిఎస్సీ ఆనర్స్ చేశారు. 2014 జూన్‌లో ఆమె విశ్వవిద్యాలయం డీన్ గౌరవ జాబితాలో ఉంది. విజయప్రియకు ఇంగ్లీష్, ఫ్రెంచ్, హిందీ, క్రియోల్, పిడ్జిన్ (ఫ్రెంచ్‌లోని) భాషలు తెలుసు. ‘కైలాస’ దేశానికి ఒక వెబ్‌సైట్ కూడా ఉంది. అందులో దేశం తరఫున నిత్యానంద ఒప్పందాలు చేసుకుంటారని విజయప్రియ నిత్యానంద పేర్కొంది. ఫిబ్రవరి 24న విజయప్రియ ఐక్యరాజ్యసమితి సమావేశంలో అనేక దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు. అమెరికన్లు అని చెప్పుకునే కొంతమంది అధికారులతో విజయప్రియ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చూపుతున్న ఫోటోలను కూడా అప్‌లోడ్ చేశారు. 150 దేశాల్లో తమకు రాయబార కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని ‘కైలాస’ వెబ్‌సైట్ పేర్కొంది.

ఇండియా నుంచి పారిపోక ముందు నిత్యానంద మీద అనేక కేసులు నమోదయ్యాయి. వాటిలో లైంగిక, మానభంగ కేసులు కూడా ఉన్నాయి. కానీ వాటినన్నింటినీ నిత్యానంద ఒప్పుకోవడంలేదు. ఆయన ఇండియా నుంచి పారిపోయాక 2019లో ‘కైలాస’ అనే దేశాన్ని సృష్టించుకున్నారు. అది ఈక్వెడర్ తీరంలో ఉన్న ఓ ద్వీపంగా బిబిసి తెలిపింది. హిమాలయలలోని శివుని స్థలం అయిన కైలాసం పేరును నిత్యానంద తన దేశానికి పెట్టుకున్నారు. ఒకానొక సమయంలో నిత్యానంద తమ దేశంలో ఉన్నారన్న విషయాన్ని సైతం ఈక్వెడర్ ఖండించింది. 2019 నుంచి ఆయన ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించపోయినప్పటికీ ఆయన ప్రసంగాలు, పూజాపునస్కారాలు సోషల్ మీడియా ద్వారా కనిపిస్తున్నాయి.

 

Vijaypriya Nityananda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News