Monday, December 23, 2024

గెటౌట్.. నన్నే బెదిరిస్తావా: బార్ అధ్యక్షుడిపై సిజెఐ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గురువారం కోర్టులో సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం కోర్టు నుంచి బయటకు వెళ్లండి..మీ బెదిరింపులకు భయపడేదిలేదు అంటూ చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. న్యావాదుల చాంబర్ల కోసం భూమి కేటాయింపునకు సంబంధించిన కేసును లిస్టింగ్ చేయడంపై ఈ వాగ్వివాదం చోటుచేసుకుంది.

చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ ఎదుట న్యాయవాది వికాస్ సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎన్నిసార్లు అర్థించినా కేసు విచారణ చేపట్టడంలేదని, వెంటనే ఈ కేసు విచారణ చేపట్టాలని కోరారు. సాధారణ ప్రక్రియలో ఈ కేసు విచారణ చేపడతామని సిజెఐ సమామాధానమిచ్చారు. ఇప్పటికి ఆరుసార్లు ఈ కేసు లిస్టింగ్ కాలేదని, అలాగైతే నేను మీ ఇంటికి రావలసి వస్తుందని వికాస్ సింగ్ చెప్పడంతో చీఫ్ జస్టిస్ ఆగ్రహోదగ్రులయ్యారు. తక్షణం కోర్టు నుంచి బయటకు వెళ్లండి..మమల్ని బెదిరింపులకు భయపడేదిలేదు అంటూ మండిపడ్డారు. దీంతో వికాస్ సింగ్ కూడా స్వరం పెంచుతూ తాను కూడా బార్ అసోసియేషన్‌కు జవాబుదారీనేనంటూ వ్యాఖ్యానించారు.

మిస్టర్ వికాస్ సింగ్..దయచేసి మీ గొంతు పెంచకండి. బార్ అధ్యక్షుడిగా దానికి మీరు నాయకుడు కావచ్చు. మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు. సుప్రీంకోర్టుకు కేటాయించిన స్థలాన్ని చాంబర్ల నిర్మాణం కోసం బార్‌కు కేటాయించాలని కోరుతూ మీరు రాజ్యాంగంలో 32వ ఆర్టికల్ కింద పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు వచ్చినపుడు ఆ కేసును డీల్ చేస్తాం..దయచేసి మమల్ని బెదిరించడానికి ప్రయత్నించవద్దు అంటూ చీఫ్ జస్టిస్ స్పందించారు. తాను విచారణను మాత్రమే కోరుతున్నానని, ఈకేసును కోర్టు కొట్టివేసినా తనకు అభ్యంతరం లేదని సింగ్ చెప్పారు. మార్చి 17న ఈ కేసు విచారణ తేదీని నిర్ణయించామని, ఈ కేసును సీరియల్ నంబర్ 1గా ముందుకు తీసుకురాలేమని సిజెఐ జవాబిచ్చారు.

అనంతరం సిజెఐ చంద్రచూడ్ న్యాయవాది వికాస్ సింగ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ..తాను ఈ కోర్టుకు చీఫ్ జస్టిస్‌నని, 2000 సంవత్సరం నుంచి సుప్రీంకోర్టులోనే న్యాయమూర్తిగా ఉన్నానని గుర్తు చేశారు. గడచిన 22 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నానని, బార్ సభ్యుడు కాని, కక్షిదారుడు కాని ఎవరూ తనను ఇప్పటివరకు ఏ రకమైన బెదిరింపులకు పాల్పడలేదని, చీఫ్ జస్టిస్‌గా మిగిలిన రెండు సంవత్సరాల కెరీర్‌లో కూడా ఇలాగే కొనసాగుతానని సిజెఐ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News