Monday, December 23, 2024

పెండింగ్ బిల్లులపై న్యాయపోరాటం..

- Advertisement -
- Advertisement -

గవర్నర్ వ్యవహారంపై సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
10 బిల్లులు ఆమోదించకుండా గవర్నర్ జాప్యం చేస్తున్నారు
ఉభయ సభల్లో ఆమోదించుకున్న బిల్లులను పెండింగ్‌లో పెట్టడం సబబుకాదు
వెంటనే పెండింగ్ బిల్లులు ఆమోదించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వండి
పిటిషన్‌లో సుప్రీం కోర్టును కోరిన సర్కార్
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖలు చేయగా.. గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. గవర్నర్ మొత్తం పది బిల్లులు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

సెప్టెంబర్ నెల నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానానికి వివరించింది. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ప్రభుత్వం ఉభయ సభల్లో ఆమోదించుకున్న బిల్లులను పెండింగ్‌లో పెట్టడం సబబుకాదని వెంటనే పెండింగ్ బిల్లులు ఆమోదించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని సర్కార్ పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవే

1.తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు
2. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు
3. అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు
4. పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లు
5. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ
6. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు
7. మోటార్ వాహనాల పన్ను చట్ట సవరణ బిల్లు
8. పురపాలక చట్ట సవరణ బిల్లు
9. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు
10. వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు

6 నెలలుగా 7 బిల్లులు పెండింగ్
గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 8 బిల్లులను తీసుకొచ్చింది. అందులో రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేయడం, సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వ విద్యాలయంగా మార్చడం, రాష్ట్రంలో మరి కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చేలా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జిహెచ్‌ఎంసి చట్టం, పురపాలక చట్టం, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ, జిఎస్‌టి చట్ట సవరణ బిల్లులు సెప్టెంబర్ 13న ఉభయ సభల ఆమోదం పొంది.. గవర్నర్ ఆమోద ముద్ర కోసం రాజ్‌భవన్‌కు చేరాయి.

వీటిలో జిఎస్‌టి చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలపగా.. మిగిలిన 7 బిల్లులు గత దాదాపు గత 6 నెలలుగా రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడు గత నెలలో జరిగిన శాసనసభలో మరో 3 కొత్త బిల్లులకు ఉభయ సభల ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ మూడు బిల్లులు సైతం రాజ్‌భవన్‌లోనే గవర్నర్ వద్ద పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News