Monday, December 23, 2024

కాంగ్రెస్‌కు మూడు అసెంబ్లీ స్థానాలు..

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌కు మూడు అసెంబ్లీ స్థానాలు
ఉప ఎన్నికల్లో బిజెపి, టిఎంసిలకు షాక్
ఈరోడ్‌లో ఇలంగోవన్ ఘనవిజయం

న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా అయిదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా గురువారం వెలువడ్డాయి. మహారాష్ట్రలో రెండు అసెంబ్లీ స్థానాలతో పాటుగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించి కాస్త పరువు నిలబెట్టుకుంది. మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని కస్బాపేట్, చించ్వాడ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి కంచుకోటగా భావించే కస్బాపేట్‌లో కాంగ్రెస్ తన విజయం సాధించి సత్తా చాటింది.

రాష్ట్రంలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో శివసేన చీలిక వర్గంబిజెపిసంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన ఈ ఉప ఎన్నికలను అధికార కూటమితో పాటుగా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. చించ్వాడి నియోజకవర్గాన్ని బిజెపి తిరిగి దక్కించుకున్నప్పటికీ 28 ఏళ్లుగా విజయం సాధిస్తూ వస్తున్న కస్బాపేట్‌లో ఆ పార్టీ కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయింది. కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర ధంగేకర్ బిజెపి అభ్యర్థి హేమంత్ రసనేపై దాదాపు 9 వేల మెజారిటీతో గెలుపొందారు. చించ్వాడ్‌లో బిజెపి అభ్యర్థి అశ్విని జగ్తాప్ ఎన్‌సిపి అభ్యర్థి నానా కాటేపై దాదాపు 28 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

బెంగాల్‌లో దీదీకి షాక్
పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌దిఘి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి దేబశీశష్ బెనర్జీపై కాంగ్రెస్ అభ్యర్థి బైరాన్ బిశ్వాస్ 22 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు సిపిఎం మద్దతు ఇవ్వడం గమనార్హం. ఉప ఎన్నిక ఫలితంపై తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ కాంగ్రెస్, సిపిఎం, బిజెపి అనైతిక పొత్తు కారణంగానే తమ అభ్యర్థి ఓడిపోయాడని ఆరోపించారు. అంతేకాదు ఇకపై కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు. కాగా బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఇది ఏకైక సీటు కావడం గమనార్హం.

ఈరోడ్‌లో ఇలంగోవన్ ఘన విజయం
తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గంలో అధికార డిఎంకె మద్దతుతో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఇలంగోవన్ భారీ మెజారిటీతో గెలుపొందారు.పోలయిన లక్షా 70 వేల ఓట్లలో ఇలంగోవన్‌కు లక్షకు పైగా ఓట్లు రాగా ప్రత్యర్థి అన్నాడిఎంకెకు చెందిన కెఎస్ తెన్నరసుకు కేవలం 43 వేల ఓట్లే వచ్చాయి.

జార్ఖండ్‌లో బిజెఎజెఎస్‌యు గెలుపు
జార్ఖండ్‌లోని రామ్‌ఘర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి మిత్రపక్షమైన ఎజెఎస్‌యు పార్టీ అభ్యర్థి సునీతా చౌదరి జెఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ అభ్యర్థి బజరంగ్ మహతోపై 21 వేలపైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. కాగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని లుమ్లా నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి సేరింగ్ లాము పోటీ లేకుండా ఎన్నికైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News