Friday, November 22, 2024

పవర్‘ఫుల్’ డిమాండ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఒక పక్క ఎండలు, మరో వైపు పరిశ్రమల రంగం 24 గంటలు ఉత్పత్తులు చేసుకుంటున్న క్రమంలో డిమాండ్ అమాంతంగా పెరుగుతోంది. రాష్ట్రంలో 14738 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇందులో ఒక్క టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ పరిధిలోనే శుక్రవారం నాడు 9359 మెగావాట్ల పీక్ డిమాండ్ నమో దు కావడం విద్యుత్ వినియోగిస్తున్న తీరును స్పష్టం చేస్తోంది. అటు టిఎస్ ఎన్‌పిడిసిఎల్ పరిధిలో గురువారం ఒక్కరోజే 24 గంటల్లో అత్యధికంగా 187.63 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం నమోదైంది. ఉమ్మడి రాష్ట్రం మొత్తం గరిష్ట విద్యుత్ డిమాండ్ కేవలం 6,666 మెగావాట్లు మాత్రమే ఉండేది.

అది కూడా టిఎస్ ఎప్‌పిడిసిఎల్ పరిధిలోని జిహెచ్‌ఎంసి, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో వినియోగం వరకే కావడం గమనార్హం. తెలంగాణలో టిఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు ప్రభుత్వం పెద్దపీట వేయడంతో భారీగా వచ్చిన పరిశ్రమలు తమ కార్యకలాపాలను చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ పరిధిలో సుమారు 10 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ రావచ్చని అంచనా వేస్తున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో శుక్రవారం 2700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కావడం గమనార్హం. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాయదుర్గంలో ఇటీవలే అతిపెద్ద సబ్‌స్టేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అటు దేశ వ్యాప్తంగానూ…

కాగా అటు దేశ వ్యాప్తంగానూ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 126.16 బిలియన్ యూనిట్లకు కరెంటు వినియోగం చేరింది. విద్యుత్ వినియోగంలో నిరంతరం పెరుగుదల కారణంగా సింగరేణి బొగ్గుకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలోనూ భారీగా పెరుగుదల చోటు చేసుకుంటోంది. కాగా తెలంగాణలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో వ్యవసాయ రంగానికే 30 నుండి 40 శాతం వరకు వినియోగిస్తుండగా పారిశ్రామిక రంగం ఇటీవలి కాలంలోనూ 30 శాతం వరకు వినియోగించుకుంటోంది. టిఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో భారీగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు కావడంతో విద్యుత్ వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగిందని విద్యుత్ శాఖ ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News