సిద్దిపేట: ఎత్తుపై ఉన్న బుస్సాపూర్ గ్రామానికి రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇరిగేషన్ పైపులైన్ల ద్వారా మీ పొలం వాకిట్లోకి సాగునీళ్లు త్వరలోనే తేనున్నామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మీ ఇంటి పోయికాడికే మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్లు అందిస్తున్నామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రెండేళ్లుగా పెండింగులో ఉన్న వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తూ మీ బ్యాంకులలో జమ చేస్తామని మహిళా సంఘాలకు ఆర్థిక మంత్రి తీపి కబురు చెప్పారు. బుస్సాపూర్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రారంభం, రెడ్డి సంక్షేమ భవనానికి శంకుస్థాపన, మహిళా భవనం, లైబ్రరీ, రూ.16 లక్షల వ్యయంతో 10 మెట్రిక్ టన్నుల స్టోరేజీ కలిగిన కోల్డ్ స్టోరేజీలను జెడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బుస్సాపూర్-తడ్కపల్లి వద్ద డ్యామ్ కడతామని ఆందోళన చెందిన, అలాగే వరదరాజ్ పల్లి-ఘనపురం, తొర్నాల, గుడికందుల గ్రామాలకు వెళ్లే రోడ్డు సమస్య గురించి గ్రామస్తులతో గత జ్ఞాపకాలను గుర్తు చేశారు. వరదరాజుపల్లి, ఘనపురం, తొర్నాల రోడ్లు పూర్తి చేసుకున్నామని, ఇక తొర్నాల, ఘనపురం, గుడికందుల వెళ్లేందుకు డబుల్ లేన్ రోడ్డు పూర్తవుతున్నదని మంత్రి తెలిపారు. ఈ మేరకు బుస్సాపూర్ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, దీంతో ప్రాంత భూముల ధరలు అమాంతంగా పెరిగాయని మంత్రి వెల్లడించారు.
అనవసరంగా ఆపరేషన్లు చేయించొద్దని ఆపరేషన్ల వల్ల ఆరోగ్యం క్షీణీస్తోందని మహిళలకు అవగాహన కల్పించారు. ముహూర్తం పెట్టుకుని ఆపరేషన్ కోసం పట్టు పట్టొద్దని, ఏఎన్ఏం, ఆశా వర్కర్లు చెబుతున్నట్లు నార్మల్ డెలివరీ చేయించాలని, ఆపరేషన్ తో తల్లీ, బిడ్డ ఆరోగ్యం దెబ్బ తింటుందని, మొదటి గంటలో తల్లీ పాలు తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుందని, శిశు మరణాలు తగ్గే అవకాశం ఉంటుందని ఆరోగ్య సూత్రాలు వివరించారు.
తల్లీ, బిడ్డ ఆరోగ్య రక్షణకు ఏఎన్ఏం, ఆశా కార్యకర్తలుగా సారథులు మీరే తల్లీ, బిడ్డ ఆరోగ్యం ముఖ్యమని, మీకు తెలియకుండా మీరు నష్ట పోతున్నారని, 64 శాతం పిల్లలు తల్లీ పాలకు దూరం అవుతున్నారని, అందు కోసం పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తాగించాలని వాటి ఆవశ్యకతను సవివరంగా తెలియజేస్తూ.. అవగాహన కల్పించారు. ప్రతీ తల్లీ, బిడ్డల ఆరోగ్య రక్షణకు సారథులు మీరేనని వాస్తవాలను ప్రజలకు చెప్పాలని ఏఎన్ఏం, ఆశా కార్యకర్తలకు మంత్రి సూచించారు. మీకు చెబితే లక్ష మందికి చెపినట్లుగా.. ప్రజల జీవన ఆరోగ్య ప్రమాణాలు పెరిగితేనే ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేయవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సదాశివ రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీహరి గౌడ్, ఏంపీపీ శ్రీదేవి-చందర్, ఇతర గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.