తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రూపొందిన చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేణు ఎల్దండి దర్శకత్వంలో హర్షిత్, హన్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న థియేటర్స్‌లో విడుదలైంది. సక్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి ఆదరణను దక్కించుకుంటుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం సినిమా ఆకట్టుకుంటోంది. మనందరి జీవితాల్లో జరిగిన , మనం చూసిన ఘటనలను ఆధారంగా చేసుకుని మనిషికి బందాలే గొప్ప బలం.. బలగం అనే చాటి చెప్పేలా సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా కథ నాదంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ అనే వ్యక్తి మీడియా ముందు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై చిత్ర దర్శకుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ
‘‘మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా నాన్నతో కలిపి ఆరుగురు. మానాన్నే అందులో చిన్నవాడు. అలాగే నాకు ముగ్గురు మేనత్తలు, ముగ్గురు పెద్దమ్మలు, ముగ్గురు మేనమామలు.. మా కజిన్స్‌తో సహా మా ఫ్యామిలీ అంతా కలిస్తే 100కి పైగానే ఉంటాం. తెలంగాణలో పెళ్లైనా, చావైనా పండగే. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఈ వంద మంది వచ్చారు. చేదు నోరు అనే కాన్సెప్ట్ తెలంగాణలో ఉంటుంది. ఎందుంకటే బాధల్లో ఉన్నవాళ్లకు ఇంత మందు తాపించి వారి బాధను పంచుకుంటామనేది కాన్సెప్ట్. ఇది తెలంగాణ సంస్కృతిలో భాగం. అప్పుడు నాకు 18-19 ఏళ్లు ఉంటాయి. చనిపోయిన వ్యక్తి చుట్టూ జరుగుతున్న విషయానలను చూడగానే నాకొక కొత్త ప్రపంచం కనిపించింది. చావులో ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయా? అని అనిపించింది. అప్పటి నుంచి నా మైండ్‌లో వందల సిట్యువేషన్స్ ఇరుక్కుని ఉండిపోయాయి.
అలాగే నా రెండో పెద్ద నాన్నకి 96 ఏళ్లు. ఆయన చనిపోయిన 15 రోజులకే పెద్దమ్మ చనిపోయింది. నేను అప్పుడు షూటింగ్స్‌లో బిజీగా ఉండి వెళ్లలేక పోయాను. ఆ విషయాన్ని మా అన్నయ్యకు చెప్పగానే ఆయన చాలా బాధపడ్డారు. తర్వాత ఇంతకు ముందు నేను చెప్పినట్లు నోటి చేదు అనే సాంప్రదాయంతో మందు, చికెన్ తీసుకుని అన్నయ్య (మా పెద్దనాన్నా కొడుకు) ఇంటికి వెళ్లాను. తను అప్పుడు నాతో మాట్లాడుతూ అమ్మది 86 ఏళ్ల స్నేహం. తన దోస్తును వెతుక్కుంటూ వెళ్లిపోయింది’ అని అనగానే ఆశ్చర్యమనిపించింది. ఇవన్నీ నా మైండ్‌లో తిరుగుతుండింది.
తెలంగాణలో బుడగ జంగమలు అనే వాళ్లు మన పెద్దలు చనిపోయినప్పుడు పాట పాడుతుంటారు. మా పెద్దనాన్న, పెద్దమ్మ చనిపోయారని చెప్పి వాళ్లతో పాట పాడించుకున్నారు. చనిపోయిన వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని జంగమలు చెప్పించి పాట పాడించుకున్నారు. ఓ రకమైన ఆనంద బాష్పాలను కార్చారు. ఆ విషయం నాకు తెలిసింది. ఇదొక గొప్పగా అనిపించిన విషయం.. దీన్ని నేను చెప్పాలని అనుకున్నాను. కాకులు ముట్టటం అనేది నేనేమీ కొత్తగా చెప్పలేదు. మన సాంప్రదాయం. తెలుగు జాతి పుట్టినప్పటి నుంచి ఉంది. ఇది తెలుగువాళ్ల సాంప్రదాయం. ఇది అందరికీ తెలిసిందే. దీనిపై కథ చేయాలనుకున్నప్పుడు ముందు కామెడీ సన్నివేశాలను రాసుకున్నాను. ఎందుకు కొట్టుకుంటున్నారు… తాగుతున్నారు.. ఏడుస్తున్నారు.. అసలేం ఏం చేస్తున్నారనేది ఆలోచించి కామెడీ సీన్స్ రాసుకున్నాను. ఈ సన్నివేశాలను నాకు తెలిసిన డైరెక్టర్స్‌కు చెపప్పగానే వాళ్లు గొల్లున నవ్వి చాలా బావుందన్నారు. కొన్ని ఎమోషన్స్ కూడా ఉన్నాయని అన్నారు.
జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కె.వి నాకు చాలా మంచి స్నేహితుడు. ఈ పాయింట్ చెప్పగానే అదిరిపోయింది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్ కథ అని అన్నాడు. నేను షూటింగ్స్‌లో బిజీగా ఉన్నప్పటికీ అనుదీప్ నా వెంబడి పడ్డాడు. నేను, తనతో కలిసి నాగారం, జగిత్యాల.. ఇలా పది ఊళ్లకు పగా తిరిగి అక్కడ సంప్రదాయాలను తెలుసుకుని విషయాలను రాసుకున్నాం. నిజం చెప్పాలంటే బలగం సినిమా కథ కాదు.. మన తెలుగు వారి జీవితాల్లో జరిగే మూమెంట్స్. మన జీవితాల్లో జరిగే ఘటనలే ఇవి. ఆరేళ్లు నేను నటుడిగా బిజీగా ఉన్నాను. ఆరు సంవత్సరాల కెరీర్‌ను పక్కన పెట్టేశాను. ఇలాంటి కథను గొప్పగా చెప్పాలనుకున్నప్పుడు మైండ్ డివేయేట్ కాకూడదని దాదాపు 2018 నుంచి నేను అన్నింటినీ పక్కన పెట్టి రీసెర్చ్ చేసి బలగం కథను రూపొందించాను. క్లైమాక్స్ కోసం అయితే నేను మూడు నెలలు కష్టపడ్డాను. 15 మంది బుడగ జంగాల వారిని కలిశాను. చివరకు వరంగల్ దగ్గర నర్సంపేట అడవుల్లో ఉండే మొగిలయ్య, నర్సమ్మ దగ్గరకు వెళ్లి, రెండు రోజులు వాళ్ల దగ్గరే కూర్చుని డబ్బులిచ్చి పాటలు పాడించుకుని ముందుకు తీసుకొచ్చాను. వాటిలో ఎవీ తీసుకోవాలనే దానిపై కూడా వర్క్ చేసుకుంటూ వచ్చాను. ఇంత కష్టపడ్డాను.
1947లో మనకు స్వాతంత్య్రం వచ్చింది. దానిపై ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్లది. అది చరిత్ర. దానిపై ఎవరు ఎలాగైనా స్పందించవచ్చు. ఎవరు ఎలాగైనా కథను రాయవచ్చు. ఆగస్ట్ 15 పాయింట్ నాది అంటే కుదురుతుందా? సమాజంలో పెద్ద పెద్ద వ్యక్తుల బయోగ్రఫీలు తీయటానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది. అలాగే తెలుగు వారి సాంప్రదాయాలను ఎవరైనా సినిమాగా తీయొచ్చు. అది మన హక్కు. ఇదే పాయింట్ మీద చాలా కథలు వచ్చాయి. 2000లో బెంగాలీలో అద్భుతమైన కథ వచ్చింది. 90ల్లో మరాఠీలో ఓ సినిమా వచ్చింది. కొరియన్‌లో ఓ సినిమా వచ్చింది. అలాగే తమిళంలోనూ ఓ సినిమా వచ్చింది. అంటే వాళ్లందరూ కాపీ కొట్టారంటే కుదురుతుందా. ఇది మన సంప్రదాయం కూడా కాదు. ఇండియాలోని హిందూ సాంప్రదాయం. దీనిపై ఎవరైనా స్పందించవచ్చు.
ఇప్పుడు ఎవరో సతీష్‌గారని వచ్చారు ఇప్పుడు బలగం కథ తనదని అంటున్నారు. ఆయనెవరో నాకు తెలియదు. ఇది తెలంగాణ సాంప్రదాయం. ఇది చరిత్ర మనకు ఇచ్చింది. ఎవరి సొత్తు కాదు. ఉదాహరణకు పెళ్లిలో మంగళసూత్రం కట్టటం ఓ సాంప్రదాయం, ఊరేగింపు అనేది ఓ సాంప్రదాయం, అప్పగింతలు ఓ సాంప్రదాయం. ఒక్కొక్కరికీ ఒక్కో అనుభవం ఉంటుంది. చెప్పమంటే ఒక్కొక్కరు ఒక్కో కొత్త విషయాన్ని చెబుతారు. అలాంటి వాటిని ఇది నాదని అంటే ఎలా? చావులపై భారతీయ సినిమాల్లో చాలా సినిమాలు వచ్చాయి. కాపీ కొట్టారంటే ఎలా?
నా సినిమా కథను, సతీష్‌గారు రాసిన కథను చదివి మాట్లాడండి. వన్ అండ్ హాఫ్ పేజీ కథకు వంద పేజీల కథను ఉన్న తేడా ఏంటో తెలుస్తుంది. రైటర్ అసోసియేషన్ వెళ్లి కలిసి మాట్లాడండి. వాళ్లు ఏది చెబితే దాన్ని స్వీకరిస్తాను. చిల్లర పబ్లిసిటీ కోసం ఇలా చేయటం కరెక్ట్ కాదు. తెలంగాణ సంస్కృతిని ఇంత బాగా చూపిస్తే.. దిల్‌రాజుగారు అనే నిర్మాత ఈ సినిమాను టేకప్ చేయకపోతే ఈ సినిమా గురించి ఇంతగా తెలిసేదా? నిర్మాతగా దిల్ రాజుగారు నాకు అవకాశం ఇచ్చారు. ఈ కథ రాసింది నేను. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో మాట్లాడండి. దిల్ రాజుగారి వంటి పెద్ద వ్యక్తిని అబాసు పాలు చేయటానికి, ఆయన బొమ్మ పెట్టుకుంటే వ్యూస్ వస్తాయని చిల్లర వ్యక్తులు చేసే డ్రామా ఇది. చాలా ఆవేదనగా ఉంది. తెలంగా కల్చర్‌ను ఇంత బాగా ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు దిల్ రాజుగారు ప్రాజెక్ట్‌ను టేకప్ చేయకపోతే మన కల్చర్ గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలిసేదా. దీన్ని చూసి చాలా మంది తెలంగాణ రచయితలు, దర్శకులు ముందుకు వస్తున్నారు. నాకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు.
ఈ సినిమాను రాసింది, డైరెక్టర్‌ని నేను. ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి. అంత పెద్ద నిర్మాత ఇంత ముందుకు వస్తుంటే ఆయన్ని అబాసు పాలు చేస్తున్నారు. నేను పచ్చికి కథ చదివాను. ఆయన కథలో పర్యావరణం అనే పాయింట్‌ను టచ్ చేశారు. దానికి దీనికి సంబంధం లేదు. ఇలాంటి చరిత్ర మనకు ఇచ్చిన అంశంపై ఎవరైనా సినిమాలు చేయవచ్చు. కానీ చిల్లర బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఏమొస్తుందో మీకు తెలియదా. అలాంటి తెలంగాణ సంస్కృతి గురించి చెప్పాలని దిల్ రాజుగా ముందుకు వచ్చారు. యాబై సినిమాలు చేసిన నిర్మాత. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నారు.
తెలంగాణ ఖ్యాతిని పెంచే సినిమా అని సపోర్ట్ చేయటానికి దిల్ రాజుగారు మంచి మనసుతో ముందుకు వచ్చారు. అలాంటి వ్యక్తిని అబాసు పాలు చేయవచ్చా?. తెలంగాణ మట్టి వాసన చూపించాలని నేను చేసిన ప్రయత్నాన్ని ప్రపంచం నమ్ముతుంది. రాజుగారిని కల్పించాలని కోరితే.. రాజుగారు కలిశారు. రాజుగారు కథల మధ్య సంబంధం లేదన్నారు. మంచి కథ ఉంటే తీసుకొస్తే సపోర్ట్ చేస్తానని కూడా దిల్ రాజుగారు అన్నారు. ఎవరూ చెప్పని పాయింట్‌ను కథగా రాస్తే అదే మూల కథ అవుతుంది. కాకి అనేది తెలుగువారి సంస్కృతిలో భాగమే. దానిపై కథ రాసి మూల కథ అంటే ఎలా కుదురుతుంది. ఆ పాయింట్‌తో ఎవరైనా సినిమాలు చేయవచ్చు. దిల్ రాజుగారి ముందు ఒకలా మాట్లాడి మళ్లీ మీడియా ముందుకు వెళ్లి వక్రకరించి మాట్లాడితే ఎలా. నా సినిమా మీ ముందుంది. ఆయన కథ మీ ముందు ఉంది. రెండింటి చూడండి. తప్పుంటే నా దగ్గరకు వస్తే మీరు ఎలా చెబితే అలా చేస్తాను. విజయేంద్ర ప్రసాద్, అబ్బూరి రవి వంటి ఇండియాలో గుర్తింపు పొందిన రచయితలున్న సంఘం ఉంది. అక్కడి వెళ్లి చెప్పండి. వాళ్లేం చెబితే నేను అది వింటాను. నేనే చట్టపరంగా వెళ్దామని నిర్ణయించుకున్నాను. దిల్ రాజుగారిని మధ్యలో తీసుకొస్తే నేను ఊరుకోను’’ అన్నారు.