మన తెలంగాణ/దమ్మపేట: న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేసిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం దమ్మపేట అర్బన్ కాలనీకి చెందిన షేక్ నూర్జహాన్‌ను అత్తింటి వారు వేధింపులు గురిచేస్తున్నారని భర్త, అత్త, తమ్ముడు తనను వేధిస్తూ కొడుతున్నారని పోలీస్‌స్టేషన్ ముందు కన్నీరు మున్నీరు అయింది. తన భర్త నాగుల్ మీరా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని అదే విషయం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కౌన్సిలింగ్ ఇప్పించినా భర్త ప్రవర్తన మారకపోవడంతో ఆవేదనకు లోనైన మహిళ ఆమె అన్నయ్యను, తల్లిని కుటుంబ సభ్యులతో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు.
తన భర్త నాగుల్‌మీరాకు ఒక బీఆర్‌ఎస్ నేత అండదండలు ఉండటంతో నాకు పోలీస్‌స్టేషన్‌లో న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో నా చెల్లికి న్యాయం జరగటం లేదని అన్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించే సమయంలో ఒక్కసారిగా పోలీస్‌లు పెట్రోల్ బాటిల్ లాక్కుని తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీస్‌లు ఎంత నచ్చజెప్పినా బాధిత కుటుంబ సభ్యులు వినకపోవడంతో అక్కడకు చేరుకున్న ఎస్సై శ్రావణ్‌కుమార్ షేక్ నాగుల్‌మీరాపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటానని వారికి హామి ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ధర్నా విరమించి, భర్త నాగుల్‌మీరాపై ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రావణ్‌కుమార్ నాగుల్ మీరాపై కేసు నమోదు చేశారు.