Monday, November 25, 2024

ఆడబిడ్డలకు ప్రభుత్వ కానుక..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహిళా దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకి కానుకను అందించనున్నది. రూ. 750 కోట్ల వడ్డీ లేని రుణాలు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది. మహిళా దినోత్సవం సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు భారీ ఎత్తున వడ్డీ లేని రుణాలు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఈ రోజు 250 కోట్ల రూపాయలను పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల కోసం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తరపున పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. రాష్ట్రంలోని 23 జిల్లాల పరిధిలో ఉన్న పురపాలక పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఈ నిధులు అందనున్నట్లు మంత్రి తెలిపారు.

గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వడ్డీ లేని రుణాల బకాయిలను మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు విడుదల చేయడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలన్నీ, సంఘాల్లోని సభ్యులు అత్యంత ఆర్థిక క్రమశిక్షణతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లిస్తున్నారని మంత్రి తెలిపారు. రీపేమెంట్ ఆఫ్ లోన్స్ విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో మన మహిళలు ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పురపాలికల్లో లక్షా 77 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, ఇందులో దాదాపు 18 లక్షల మంది సభ్యులుగా కొనసాగుతున్నారని, వీరందరికీ ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ లేని రుణాల నిధులు ఉపయుక్తంగా ఉంటాయని ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు.

ఇప్పటి వరకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు సుమారు 15,895 కోట్ల రూపాయలను రుణాల లింకేజీ రూపంలో అందించిందని మంత్రి తెలిపారు. ఇంత భారీ రుణాల పైన వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రూపొందించిన వడ్డీలేని రుణాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రూ.370 కోట్లను, దాదాపు 90,325 స్వయం సహాయక సంఘాలకు అందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల నిధులను పెద్ద ఎత్తున విడుదల చేయడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాల తరఫున ప్రభుత్వానికి మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News