లక్నో: కన్న పిల్లల మీద కోపంతో ఓ వ్యక్తి కోట్ల విలువైన తన ఆస్తిని ప్రభుత్వానికి ధారాదత్తం చేశాడు. అంతేకాదు తన తన మృతదేహాన్ని సైతం వైద్య పరిశోధనలకోసం ఉపయోగించాలని అధికారులను కోరారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముజఫర్‌నగర్‌కు చెందిన 85 ఏళ్ల నాథూసింగ్‌కు ఒక ఇల్లు, కొంతభూమి ఉన్నాయి. వాటి విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుంది. అతనికి ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు స్కూల్ టీచర్‌గా పని చేస్తుడగా, కూతుళ్లందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఇటీవలే నాథూసింగ్ భార్య చనిపోవడంతో ఒంటరివాడయిన ఆ వృద్ధుడు వృద్ధాశ్రమానికి వెళ్లిపోయాడు.
గత ఏడు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. తనను చూడడానికి తన కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో తన ఆస్తినంతా ప్రభుత్వానికి రాసిస్తూ వాటిని గ్రామంలో పాఠశాల, ఆస్పత్రి నిర్మాణం కోసం ఉపయోగించాలని కోరాడు. ఈ వయసులో తన బాగోగులు చూడాల్సిన తన కొడుకు, కోడలు తనను సరిగా పట్టించుకోకపోవడంతో తన ఆస్తిని ప్రభుత్వానికి ఇచేసినట్లు ఆయన ఆవేదనగా చెప్పాడు. ఆఖరికి చనిపోయాక తన మృతదేహాన్ని వైద్య పరిశోధనలకోసం ఇచ్చేస్తున్నట్లు చెప్పాడు. ఎందుకంటే తన అంత్యక్రియలప్పుడు కూడా తనకొడుకు, కూతుళ్లు ఎవరూ రాకూడదని చెప్పాడు. ఈ మేరకు వీలునామా రాశాడు.
కాగా గత ఏడు నెలల్లో నాథూ సింగ్‌ను చూడడానికి ఎవరూ రాలేదని, దీంతో అతను బాగా కలత చెందాడని ఓల్డేజ్ హోమ్ మేనేజర్ రేఖా సింగ్ చెప్పారు. కాగా నాథూసింగ్ వీలునామా తమకు చేరిందని, ఆయన మరణానంతరం ఇది అమలులోకి వస్తుందని స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తెలిపింది.