బెంగళూరు: అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎమ్మెల్యే మడల్ విరూపాక్షప్ప కనబడడం లేదంటూ కర్నాటకలోని దావణగెరెలో పోస్టర్లు వెలిశాయి. విరూపాక్షప్ప అరెస్టు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ పోస్టర్లు వేసింది. విరూపాక్షప్ప తరఫున ఆయన కుమారుడు ప్రశాంత్ మడల్ ఇటీవల లంచం పుచ్చుకుంటూ లోకాయుక్త అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.
అప్పటి నుంచి పరారీలో ఉన్న విరూపాక్షప్ప తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరడంతోపాటు ముందస్తు జామీను కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాగా..విరూపాక్షప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న చనగిరి నియోజకర్గంతోపాటు దావణగెరెలో విరూపాక్ష మిస్సింగ్ పోస్టర్లను కాంగ్రెస్ అనేక చోట్లడోడలపై అతికించింది. ఈ పోస్టర్లలో విరూపాక్షప్ప ఫోటోతోపాటు ఆయన ఎత్తు(5.6 అడుగులు), వయసు(72), రంగు((గోధుమ రంగు) వంటి వివరాలతోపాటు ఆయన చివరిగా ముఖ్యమంత్రి ఎసార్ బొమ్మై నివాసంలో కనిపించాడని, ఆయన వివరాలు తెలిస్తే 100కు కాల్ చేయాలంటూ ప్రజలకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.