న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యంపైన, ఆర్‌ఎస్‌ఎస్‌పైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలను బిజెపి తీవ్రంగా ఖండించింది. రాహుల్ వ్యాఖ్యలు ఆయన మావోయిస్టు ఆలోచనా విధానంతోపాటు ్ల, అరాచక శక్తుల గుప్పిట్లో బందీ అయినట్లు స్పష్టంగా కనపడుతోందని మాజీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.
తన అసత్యాలను, నిరాధార ఆరోపణలను వ్యాప్తిచేయడానికి బ్రిటిష్ పార్లమెంట్‌ను రాహుల్ గాంధీ వేదికగా చేసుకోవడాన్ని ఆయన ఖండించారు. విదేశీ గడ్డపైన భారత ప్రజాస్వామ్యం, రాజకీయ వ్యవస్థ, పార్లమెంట్, న్యాయ వ్యవస్థ, భద్రతాపరమైన అంశాల గురించి రాహుల్ మాట్లాడడం సిగ్గుచేటని ప్రసాద్ ఆరోపించారు. అన్ని ప్రజాస్వామిక విధానాలను, రాజకీయ విజ్ఞతను రాహుల్ మరచిపోయారని ఆయన విమర్శించారు. భారత్‌లో ప్రజాస్వామ్య రక్షణకు యూరప్, అమెరికా జోక్యాన్ని రాహుల్ కోరడం సిగ్గుచేటని ప్రసాద్ అన్నారు.
భారత అంతర్గత వ్యవహారాలలో విదేశీ జోక్యాన్ని సహించరాదన్న భారతీయుల ఏకాభిప్రయాన్ని కూడా రాహుల్ తోసిపుచ్చారని ఆయన అన్నారు. అత్యంత బాధ్యతారాహిత్యంతో రాహుల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖండిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ చేసిన విమర్శలను ప్రసాద్ ఖండిస్తూ సమాజానికి, దేశానికి ఆర్‌ఎస్‌ఎస్ ఎంతో సేవ చేస్తోందని ఆయన కీర్తించారు.