Monday, December 23, 2024

మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు

- Advertisement -
- Advertisement -

జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్:  మహిళా జర్నలిసుల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, ఆరోగ్య పరీక్షలు చేయనున్నట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో మహిళా జర్నలిస్టులకు మంగళవారం సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం తరఫున సత్కారం, గుర్తింపు పొందుతున్నందుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టులు మంచి పని చేసినప్పుడు ఎవరూ పొగడరని, ఒక నెగెటివ్ వార్తను ప్రసారం చేస్తే అన్ని వైపుల నుంచి దాడి ఉంటుందన్నారు. తమ మున్సిపల్ శాఖ బాధ్యత కూడా అంతే ఉంటుందన్నారు. రోజు హైదరాబాద్‌ను శుభ్రంగా ఉంచే మున్సిపల్ సిబ్బందిని మెచ్చుకునే వారు ఎవరూ లేరని, రెండు రోజులు అక్కడో ఇక్కడో పైపు పగిలిపోయి, ఒక మోరీ శుభ్రం చేయకపోతే, ఏదైనా ఇబ్బంది వస్తే విపరీతమైన దాడి ఉంటుందని కెటిఆర్ తెలిపారు.

వి హబ్ ఆధ్వర్యంలో యాక్సిలేటర్ ప్రోగ్రామ్..

లేడీ ఫొటోగ్రాఫర్లు, జర్నలిస్టులను చూస్తుంటే అప్పుడప్పుడ బాధ అనిపిస్తుంటుందని కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వి హబ్ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం ‘విమెన్ ఇన్ జర్నలిజం లీడర్షిప్ యాక్సిలేటర్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించబోతున్నామని, ఎవరైనా ఔత్సాహికులు ఉంటే ముందుకు రావాలని ఆయన సూచించారు. సమర్థవంతంగా, కొత్త కొత్త పోకడలు, కొత్త వినూత్న ఆలోచనలను అర్థవంతంగా నేర్చుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు తెచ్చుకోవాలనుకునే వారి కోసం యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. వి హబ్ ఆధ్వర్యంలో రెండు రోజుల లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఐ అండ్ పిఆర్ కమిషనర్ అరవింద్‌కుమార్ కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని కెటిఆర్ ప్రశంసించారు. అంతకు ముందు సంవత్సరం ఇలాంటి కార్యకక్రమం నిర్వహించకోవాలనుకున్నా కొవిడ్ వల్ల జరుపులేకపోయామని ఆయన తెలిపారు.

పాజిటివ్ న్యూస్‌ను కూడా ప్రసారం చేయాలి

‘జర్నలిస్టులందరికీ కెటిఆర్ ఒక విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్, ప్రజాప్రతినిధులు అందరూ కోరుకునేది ఒకటేనని తాము ఏదైనా తప్పు, పొరపాటు చేస్తే, ప్రజా వ్యతిరేక పనులు చేసిన సమయంలో చీల్చిచెండాడే హక్కు మీడియాకు ఉంటుందని ఆయన తెలిపారు. మీడియా ఫోర్త్ ఎస్టేట్ అని, అదే సమయంలో మనిషిని కుక్క కరిస్తే వార్త కాదనీ, కుక్కను మనిషి కరిస్తే కూడా వార్త కాదనీ ఆయన తెలిపారు. కెసిఆర్ కిట్ ద్వారా ఇనిస్టిట్యూషన్ డెలివరీలు 30శాతం నుంచి 62శాతానికి పెరిగాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవాళ అద్భుతాలు జరుగుతున్నాయని, కిడ్నీ ట్రాన్స్‌ఫ్లాంటేషన్‌లో నిమ్స్ జాతీయ రికార్డును నెలకొల్పిందని కెటిఆర్ తెలిపారు. మాతాశిశు మరణాల సంఖ్య కూడా తగ్గిందని, ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఎలాగైతే వార్తలను హైలెట్ చేస్తున్నారో అదే పద్ధతుల్లో పాజిటివ్ న్యూస్‌ను కూడా ప్రసారం చేస్తే సమాజానికి మేలు చేసినట్టు అవుతుందని ఆయన జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు.

దాడులను నివారించేందుకు అవగాహన కల్పించాలి

మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరిగిన సమయంలో మనిషన్న వారెవరూ బాధపడకుండా ఉండరని, కానీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్లకి ఆ సెన్సివిటీ లేదనుకోవద్దని ఇలాంటి వాటిలో రాత్రికి రాత్రే మార్పులు రావని కెటిఆర్ పేర్కొన్నారు. మహిళలను గౌరవించాలి, సాటి అమ్మాయిని గౌరవించాలనే సంస్కృతీని చిన్ననాటి నుంచే మగ పిల్లలకు నేర్పించాలని కెటిఆర్ సూచించారు. జెండర్ సెన్సివిటీ, మహిళలపై దాడులు దాడులను నివారించేందుకు చేయాల్సిన కార్యక్రమాలపై జర్నలిస్టులు ఎంత అవగాహన కల్పిస్తే అంత మంచిదని కెటిఆర్ తెలిపారు.

మహిళా జర్నలిస్ట్‌లు యూనియన్‌ను ఏర్పాటు చేసుకోవాలి

సీనియర్ జర్నలిస్టులు వి హబ్‌లో భాగస్వాములు కావాలని కెటిఆర్ తెలిపారు. సీనియర్ మహిళా జర్నలిస్టులు తమ అనుభవాలు, ఆలోచనలు, ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎదురైనా సవాళ్లను కొత్త తరం జర్నలిస్టులతో పని చేసేందుకు వి హబ్‌తో పని చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అక్రిడేటెడ్ జర్నలిస్టులకు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహిస్తామని కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో 19వేల జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జర్నలిస్టులకు జారీ చేశామని, గుజరాత్లో కేవలం 3వేల కార్డులే జారీ చేశారని ఆయన తెలిపారు. మహిళా జర్నలిస్టులంతా ఏకమై మహిళా జర్నలిస్ట్‌లు యూనియన్‌ను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News