సియోల్: దక్షిణ కొరియాలో ఓ వ్యక్తి అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. 1,000 శునకాలను ఆకలితో అలమటింపచేసి చంపేశాడు. తమ కుక్క తప్పిపోవడంతో దాన్ని వెతుక్కుంటూ వెళ్లిన యజమాని ఒకరు ఓ ఇంట్లో శునకాలు చనిపోయి ఉండడం చూసి అధికారులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. నిందితుడ్ని గ్యాంగి ప్రావిన్స్‌లోని యంగ్‌ప్యోంగ్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. వెంటనే అతడ్ని అరెస్టు చేశారు.
అయితే శునకాల మృతికి తానే కారణమని నిందితుడు అంగీకరించాడు. యజమానులు వదిలేసిన, జీవితకాలం పూర్తయిన శునకాలను సేకరించి వాటి కడుపుమాడ్చి చనిపోయేలా చేసినట్లు వివరించాడు. ఇందుకు గాను ఒక్కో శునకానికి వాటి యజమానులు తనకు రూ.623 ఇచ్చినట్లు వెల్లడించాడు. జంతు హక్కులు ఉల్లంఘించినందుకు అధికారులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. స్థానిక చట్టాల ప్రకారం అతనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.2లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది.