Friday, November 22, 2024

ట్రాఫిక్ చలాన్లు తట్టుకోలేక కూలీ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మాదన్నపేట్: ట్రాఫిక్ చలాన్ల వేధింపులు తట్టుకోలేక ఓ హమాలీ కూలీ కెసిఆర్, కెటిఆర్‌లకు సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ ముగ్గురు కుమార్తెలను, ఒక కుమారుడిని పోషిస్తున్నానని రూ.10వేల చలాన్లు కట్టమని మీర్‌చౌక్ ట్రాఫిక్ ఎస్.ఐ గణేష్ తన ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నాడు. ఎంత ప్రాధేయపడిన వాహనం ఇవ్వలేదని నా చావుకు కారణం మీర్‌చౌక్ ట్రాఫిక్ ఎస్.ఐ గణేషే అన్ని సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల ప్రకారం… నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరడిగొమ్మ గ్రామానికి చెందిన ఎల్లయ్య (52), మల్లమ్మలు దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బతుకుతెరువు కోసం సైదాబాద్ చింతల్‌బస్తీకి వచ్చి జీవనం సాగిస్తున్నారు. భర్త కూలీగా, భార్య స్థానిక దేవాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి చంపాపేట్ భారత్ గార్డెన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ విధులు నిర్వహిస్తున్న మీర్‌చౌక్ ట్రాఫిక్ ఎస్.ఐ గణేష్‌కు ఎల్లయ్య పట్టుపడ్డాడు. దీంతో వాహనం పై రూ.10వేల చలాన్లు ఉన్నాయని వాటిని కట్టాలని ఎస్.ఐ గణేష్ ఎల్లయ్యకు చెప్పాడు. కూలీ పనులు చేసుకుంటూ అతి కష్టం మీద కుటుంబ పోషణ చేస్తున్నానని తన వద్ద అంత డబ్బులు లేవని ప్రాధేయపడ్డాడు.

ఎస్.ఐ గణేష్‌ను ఎంత బతిమిలాడిన ఒప్పుకోకపోవడంతో ఎల్లయ్య ఇంటికి వెళ్లి తన చావుకు ఎస్.ఐ గణేషే కారణమని సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని కంచన్‌బాగ్ అపోల హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలపడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులే దగ్గర ఉండి డిసిఎంలో సొంత గ్రామానికి తరలించిన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News