Saturday, December 21, 2024

మహిళా తన హక్కుల కోసం పోరాడటం శోచనీయం: మంత్రి సత్యవతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సృష్టికి మూలమైన మహిళ తన హక్కుల కోసం ఇంకా పోరాడటం శోచనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌తో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నిరాహార దీక్ష సాయంత్రం 4 గంటలకు ముగిసింది. దీక్షను సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించగా, ఎంపి కేశవరావు నిమ్మరసం ఇచ్చి కవితతో దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. మహిళలు అభివృద్ధిలో, పరిపాలనలో భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు వంటిల్లు దాటకుండా చూడాలన్న భావన సరైంది కాదని ఆమె విమర్శించారు. ఈ బిల్లుపై బిజెపికి అవకాశం ఇచ్చి ఎనిమిదేళ్లు దాటిపోయిందని, ఇంకా బిల్లు మాత్రం లోక్‌సభ ముందుకు రాలేదని ఆమె విమర్శించారు.

ఇప్పటికైనా బిజెపి కళ్లు తెరవాలని ఆమె సూచించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును పాస్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తమ పదవులు కాపాడుకోవడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును రాకుండా అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని రకాలుగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని ఆమె స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ బంజారాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించారని ఆమె వెల్లడించారు. పార్లమెంటులో మెజార్టీ ఉన్నా మోడీ ప్రభుత్వం మహిళా బిల్లుపెట్టకపోవడం సిగ్గుచేటని మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News