బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజన్లు, వికలాంగులు ఇంటి నుంచే ఓటేయవచ్చని భారత ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు. 224 సభ్యులుండే కర్నాటక అసెంబ్లీ పదవీ కాలం 2023 మే 24తో ముగియనున్నది. అందుకనే కొత్త అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. ఎన్నికల నోటిపికేషన్ వెలువడిన ఐదు రోజుల్లోనే 12డి ఫారమ్ లభిస్తుందని, దాని ద్వారా ఇంటి నుంచే ఓటేయవచ్చని ఆయన తెలిపారు.
‘మొట్టమొదటి సారి 80ఏళ్లకు పైబడినవారు, వికలాంగులైన ఓటర్లు వారి అభీష్టం మేరకు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. వారి కోసం 12డి ఫారమ్ ఉంటుంది. అది ఎన్నికల ప్రకటన విడుదలైన ఐదు రోజుల్లోనే లభ్యం కాగలదు. కావాలనుకునేవారు ఈ వెసలు బాటును వినియోగించుకోవచ్చు’ అని రాజీవ్ కుమార్ తెలిపారు. ముగ్గురు సభ్యులున్న భారత ఎన్నికల సంఘం ప్రస్తుతం కర్నాటకలో మూడు రోజుల పర్యటనపై ఉంది. అక్కడ ఏర్పాట్లను సమీక్షిస్తోంది. ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ప్రస్తుతం బెంగళూరులో పర్యటిస్తున్నారని ఈసిఐ ట్వీట్ చేసింది.