హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఇడి విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు ఇడి అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ నెల 16న మరోసారి తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదేశించింది. శనివారం ఉదయం నుంచి ఐదుగురు అధికారులతో కూడిన ఇడి బృందం కవితపై పలు ప్రశ్నలు సంధించారు. వీరిలో ఒక జాయిం ట్ డైరెక్టర్, లేడీ డిప్యూటీ డైరెక్టర్, ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు వున్నారు. కాన్ఫన్‌ట్రేషన్ ఇంటరాగేషన్ పద్ధతిలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద కవితను పలు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది.
రామచంద్రపిళ్లై, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఇడి ప్రశ్నించింది ఆఫీస్ నుంచి బయటకొచ్చిన కవిత నేరుగా ఢిల్లీలోని తన తండ్రి, తెలంగాణ సిఎం కెసిఆర్ అధికారిక నివాసానికి బయల్దేరారు. ఇక, కవితకు మద్దతుగా కెటిఆర్, హరీష్‌రావులతో పాటు పలువురు తెలంగాణ మంత్రులు, బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు కూడా ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా ఢిల్లీకి చేరుకుని కవితకు మద్దతుగా నిలిచారు. ఇకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో సిబిఐ అధికారులు కవితను సాక్షిగా విచారించిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటివరకు దాఖలు చేసిన చార్జ్‌షీట్లలో కవిత పేరును పలు సందర్భాల్లో దర్యాప్తు సంస్థలు ప్రస్తావించాయి. తాజాగా ఈ కేసులో అరెస్ట్ చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లైని న్యాయస్థానంలో హాజరుపరిచిన సందర్భంగా కూడా రిమాండ్ రిపోర్టులో కీలక అభియోగాలు మోపింది.
కవిత బినామీనని పిళ్లై ఒప్పుకున్నట్లు ఇడి తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రుని ఇండోస్పిరిట్ గ్రూప్‌లో పిళ్లై కూడా భాగస్వామిగా ఉన్నారని.. ఎల్ 1 లైసెన్స్ ఉన్న ఇండో స్పిరిట్‌లో పిళ్లైకి 32.5 శాతం వాటా ఉండగా, ప్రేమ్ రాహుల్‌కు కూడా 32.5 శాతం వాటా ఉందని ఇడి తెలిపింది. ప్రేమ్ రాహుల్, అరుణ్ రామచంద్ర పిళ్లైలు.. కవిత, వైఎస్‌ఆర్‌సిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిలకు బినామీలుగా ప్రాతినిధ్యం వహించారని ఇడి తన నివేదికలో పేర్కొంది. భాగస్వామ్య సంస్థలో కవిత వ్యాపార ప్రయోజనాలకు పిళ్లై ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఇడి పేర్కొంది. దీని ఆధారంగా కవితకు ఇడి సమన్లు జారీ చేసింది.
అయితే అరుణ్ రామచంద్ర పిళ్లై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో ఇడికి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి పిటిషన్ దాఖలు చేశారు. ఇడికి ఇచ్చిన వాంగ్మూలం వెనక్కి తీసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో కోర్టు ఇడికి నోటీసులు జారీ చేసింది. పిళ్లై మార్చి 13 వరకు ఇడి కస్టడీలో ఉండనున్న సంగతి తెలిసిందే.
పిడికిలి బిగించి కార్యకర్తలకు, నాయకులకు అభివాదం చేస్తూ ఇడి విచారణకు..
వాస్తవానికి ఈ నెల 9నే విచారణకు రావాలని ఇడి అధికారులు కవితకు నోటీసులు జారీ చేసినా ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా రెండ్రోజుల తర్వాత హాజరవుతానని కవిత లేఖ రాశారు. ఈ మేరకు 11న విచారణకు హాజరుకానున్నట్లు చెప్పారు. ఇందుకోసం గురువారం సాయంత్రమే హైదరాబాద్ నుంచి దిల్లీకి చేరుకున్న ఆమె మహిళా రిజర్వేషన్లపై శుక్రవారం దీక్ష చేపట్టారు. మ ద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనున్న నేపథ్యంలో మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావుతో పాటు శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు, ఇతర నేతలు ఒకరోజు ముందుగానే ఢిల్లీకి వెళ్లారు. శనివారం విచారణ ఉన్నందున ఉద యం నుంచి ఢిల్లీలోని కెసిఆర్ నివాసం వద్ద ఉద్విగ్న వా తావరణం నెలకొంది. ఢిల్లీలో కవిత ఉన్న తుగ్లక్‌రోడ్‌లోని కెసిఆర్ నివాసం వద్దకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు.
ఉదయం ఇడి కార్యాలయానికి వెళ్లే ముందు మంత్రులు హరీశ్‌రావు, కెటిఆర్‌తో కవిత సమావేశమై పలు అంశాలపై చర్చించారు.అనంతరం, నివాసం నుంచి 10 వాహనాల కా న్వాయ్‌లో బయలుదేరిన కవిత పిడికిలి బిగించి కార్యకర్తలకు, నాయకులకు అభివాదం చేశారు. అనంతరం భర్త అనిల్, న్యాయవాదులతో కలిసి కవిత ఇడి కార్యాలయానికి చేరుకున్నారు. కవిత విచారణ సందర్భంగా రాజకీయ వర్గాల్లో, బిఆర్‌ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొం ది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇడి కేంద్ర కార్యాలయం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలు ఇడి కార్యాలయానికి చేరుకోకుండా ఢిల్లీ పోలీసులు ముమ్మర భద్రతా చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
కాగా, శనివారం సాయంత్రం 5.30 గం టలకే విచారణ ముగియాల్సి ఉండగా అనూహ్యంగా ఆ సమయాన్ని పెంచారు అధికారులు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉ న్నా, సమయం దాటినా కవితను ఇడి బయటకు పంపలేదు. ఇడి వైఖరితో బిఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. అయితే కవిత బయటికి రాగానే బీఆర్‌ఎస్ శ్రేణులు ఈలలు, కేకలు, నినాదాలతో హోరెత్తించాయి.
హైదరాబాద్‌కు చేరుకున్న కవిత, కెటిఆర్, హరీష్‌రావు
ఇడి విచారణ అనంతరం మంత్రులు కెటిఆర్, హరీష్‌రావులతో కలిసి కవిత తన కుటుంబసభ్యులు, ముఖ్య నేతలతో ప్రత్యేక విమానంలో శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.