Monday, December 23, 2024

హెచ్3ఎన్2

- Advertisement -
- Advertisement -

2020-21లో ప్రపంచమంతటా చెప్పనలవికాని మారణ కాండకు కారణమైన కరోనా(కొవిడ్ 19)కు తిరుగులేని చరమగీతం పాడడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. చైనాలో కఠోర లాక్‌డౌన్‌లను తట్టుకోలేక ప్రజలు నిషేధాజ్ఞలను కూడా ధిక్కరించి వీధుల్లోకి వచ్చి చేసిన నిరసన ప్రదర్శనలు అక్కడి పాలకులకు వణుకు పుట్టించిన ఘట్టం ఇటీవలిదే. కరోనాలోనే అనేక పిలకలు (వేరియంట్లు) దూసుకొచ్చి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయోత్పాతంలో ముంచెత్తాయి. ఇప్పుడు మామూలు సీజనల్ జలుబు అనుకునే మాదిరి ఇన్‌ఫ్లుయెంజా రూపంలో హెచ్3ఎన్2 వైరస్ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నది. గత డిసెంబర్ నెల రెండో సగంలో బయటపడిన ఈ వైరస్ జనవరి 2 నుంచి మార్చి 5 వరకు దేశ వ్యాప్తంగా 451 మందికి సోకింది. ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. కర్నాటకలో 83 సం. రోగిని, హర్యానాలో 56 ఏళ్ళ మరో అస్వస్థుణ్ణి ఈ ఫ్లూ వైరస్ కబళించింది. వేరే రోగాలు పీడిస్తున్న వ్యక్తులకే ఇది సుళువుగా సోకుతుందని చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా విజృంభించే అవకాశాలున్నట్లు బోధపడుతున్నది. సోకిన వారు దీర్ఘ కాలం ఆసుపత్రిలో వుండాల్సి వుంటుందని ఈ విషయంలో కరోనా తరహా లక్షణాలే దీనికి వున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మాదిరిగానే ఇది కూడా ఊపిరి తిత్తులను తీవ్రంగా బాధించి శ్వాస కోశ ఇబ్బందులు కలిగిస్తుందని తెలుస్తున్నది. కరోనా సమయంలో కేంద్రం సకాలంలో ఆక్సిజన్ సరఫరా చేయలేకపోయినందున దేశ రాజధానిలోనే అసంఖ్యాకంగా రోగులు ఊపిరి పీల్చుకోలేక హఠాత్తుగా అకాల మరణాలకు దొరికిపోయిన విషాద సందర్భం ఇప్పటికీ కంట నీరు తెప్పిస్తున్నది. హెచ్3ఎన్2 ఫ్లూ వైరస్‌పై గత శుక్రవారం నాడు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సమీక్షా సమావేశం జరిపారు. జాగ్రత్తగా వుండాల్సిందని, పరిస్థితిని సన్నిహితంగా పరిశీలిస్తూ వుండాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చామని ఆయన ప్రకటించారు. వేరే రోగాలు పీడిస్తున్న చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా వుండాలని ఈ ప్రకటనలో సూచించారు.

శనివారం నాడు నీతిఆయోగ్ ఆధ్వర్యంలో అంతర్ మంత్రివర్గ సమావేశం జరిగింది. హెచ్3ఎన్2 వల్ల చనిపోయే అవకాశాలు ఏ మేరకు వుంటాయో కేంద్ర ఆరోగ్య శాఖ పరిశీలిస్తున్నదని నీతిఆయోగ్ తెలియజేసింది. దేశంలో సీజనల్ ఫ్లూ ఏడాదికి 2 సార్లు సంక్రమిస్తుందని జనవరి నుంచి మార్చి వరకు ఒకసారి, అలాగే తొలకరి ముగిసిన తర్వాత మరొకసారి వస్తుందని చెబుతున్నారు. మార్చి మాసాంతం నుండి ఫ్లూ తగ్గుముఖం పడుతుందని కూడా అంటున్నారు. అందుచేత ఈ నెలాఖరు వరకు హెచ్3ఎన్2 తీవ్రంగా వ్యాపించి ఆ తర్వాత తగ్గు ముఖం పట్టే అవకాశాలుండొచ్చు. లేదా మరింత తీవ్రతరమై కరోనా మాదిరిగా మరో చెప్పనలవికాని కల్లోలానికి దారి తీసే ప్రమాదమూ ఎదురవ్వొచ్చు.

కరోనా ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర విజ్ఞాన పరంగా గొప్ప దేశం అనిపించుకొనే అమెరికా సహా అంతటా ఆడిన కరాళ నాట్యం కళ్ళముందున్నదే. క్షణ కాలం తీరిక ఇవ్వకుండా లక్షలాది మంది ప్రాణాలను కరోనా కబళిస్తుంటే అంబులెన్స్‌లకు కూడా కరవు ఏర్పడి అనుభవించిన బాధామయ సందర్భాలు ఇప్పటికీ మరువలేనివి. అలాంటి అరుదైన దుస్థితి హెచ్3ఎన్2 వల్ల మరోసారి దాపురిస్తుందని అనుకోలేము గాని, కరోనా చవిచూపించిన సాటిలేని విషాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వుండవలసిన అవసరం వుంది. కరోనాలో మాదిరిగానే ఇప్పుడు కూడా అందరూ తమ చేతులను నిత్యం పరిశుభ్రంగా వుంచుకోవాలని, సబ్బుతో కడుక్కోవాలని భారతీయ వైద్య పరిశోధన మండలి సలహా ఇచ్చింది. అలాగే అప్పటి మాదిరిగానే జనసమ్మర్ధం గల ప్రాంతాల్లోకి వెళ్ళకూడదని, వుండరాదని చెప్పింది.

చేతులతో ముక్కు, కళ్ళు తడుముకోకూడదని సూచించింది. మనుషులు అప్పటి మాదిరిగానే ఒకరికొకరు చేరువకాకుండా వీలైనంత దూరాన్ని పాటించవలసి వుంటుంది. సామూహికతను విడనాడడమనేది సంఘ జీవనంలో అత్యంత అసౌకర్యమైనది. కాని కొవిడ్ 19 విరుచుకుపడినప్పటి నుంచి ఈ జాగ్రత్త అత్యవసరమైనదిగా మారింది. వారాంతపు సంతల మాదిరి సందర్భాల్లో పాల్గొనడం ఇటువంటి వైరస్‌లు ముంచుకు వచ్చేలా చేస్తుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు కూడా నోటిని, ముక్కును కప్పుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వైద్యుల సలహా తీసుకోకుండా యాంటిబయాటిక్స్ గాని, ఇతర మందులు గాని వాడవద్దని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మందును ప్రజా రోగ్య వ్యవస్థల ద్వారా ఉచితంగా అందుబాటులో వుంచుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆరంభంలో శూరత్వం చూపించి కరోనా ముమ్మరమైనప్పుడు చేతులెత్తేసినట్టు కాకుండా కేంద్రం ఈసారైనా తగిన ముందస్తు ఏర్పాట్లు కొరత లేకుండా చేస్తుందని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News