న్యూఢిల్లీ: రేపటి(మార్చి 13) నుంచి పార్లమెంటు బడ్జెట్ సెషన్ ‘సెకండ్ లెగ్’ ప్రారంభమవుతుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ తరచూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ వ్యాఖ్యలపై దాడికి దిగుతున్నారు. ఇదిలావుండగా లోక్‌సభ నుంచి రాహుల్ గాంధీని బహిష్కరించాలని ఓ బిజెపి ఎంపీ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోడీపైన రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్, ప్రతిపక్షాలు అదానీ గ్రూప్ అంశంపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు సమాయత్తం అవుతున్నాయి.
రాజ్యసభలో ధన్‌కర్, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగేలా కనిపిస్తుంది. ధరల పెరుగుదలపై కూడా విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని కూడా నిలదీసే ఆస్కారం ఉంది. ప్రధానంగా ఆర్జెడి నాయకులు, ఆప్ నాయకులు, బిఆర్‌ఎస్ నాయకులపై చేపట్టిన చర్యలు లేవనెత్తవచ్చు.