ములుగు: నిజాయితీకి బహుమానం బదిలినా అటవీ భూమిని రక్షించేందుకు పరిరక్షించేందుకు ప్రయత్నాలు చేసిన అటవీ అధికారి కిష్టగౌడ్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీవేటు వేయడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారుతోంది. ములుగు జిల్లా డీఎఫ్‌వోగా ఆరు నెలల కిందట బాధ్యతలు చేపట్టిన ఐఎఫ్ ఎస్ అధికారి కిష్టగౌడ్‌ను పీసీసీఎఫ్‌కు రిపోర్టు చేయాలని పేర్కొంటూ సీఎస్ శాంతకుమారి నుంచి వెలువడటం గమనార్హం. ములుగు డీఎఫ్ వోగా జయశంకర్ భూపాలపల్లి డీఎఫ్‌వో భూక్యా లావణ్యకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. శాఖలో సీన్సియర్ అధికారిగా పేరున్న కిష్టగౌడ్ బదిలీ వెనుక రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణం కనిపిస్తోందని సమాచారం.
ములుగు కలెక్టరేట్ నిర్మాణానికి కేటాయించిన స్థలం అటవీశాఖ పరిధిలోకి వస్తుందని ఆయన ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ విషయంపై రెవెన్యూ, అటవీశాఖల మధ్య వివాదంగా మారింది. ప్రభుత్వం కేటాయింపు చేసినా అటవీ అధికారి నిక్కచ్చితత్వంతో వ్యవహరిస్తుండటంతో జిల్లా ఉన్నతాధికారులకు సైతం గిట్టలేదని సమాచారం. హరితహారం కార్యక్రమంలో కిష్టగౌడ్ సేవలకు 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ హరిత మిత్ర అవార్డు, రూ. 2 లక్షల నగదు ప్రదానం చేసింది. మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో పని చేసిన ఆయన అన్యాక్రాంతమైన వేల ఎకరాల ఫారెస్ట్ భూమిని తిరిగి శాఖ పరిధిలోకి తెచ్చిన ఘనత ఆయనకుంది. అలాంటి అధికారిపై ప్రభుత్వం బదిలీ వేటు వేయడంపై శాఖ ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది.