Saturday, November 23, 2024

స్వలింగ వివాహాలకు నో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీయ జీవన వ్యవస్థలో భార్య. భర్త పిల్లలు అనే అత్యంత కీలకమైన సగటు కుటుంబ ప్రామాణికత ఉందని, దీనికి విరుద్ధమైన ధోరణి చెల్లనేరదు, ఆచరణయోగ్యం కాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు విన్పిస్తోన్న స్వలింగ వివాహ బంధం, స్వలింగ సంపర్కం వంటి ప్రక్రియలను తాము ఇంతకు ముందే వ్యతిరేకించామని, మరోమారు ఈ విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నామని కేంద్రం ఆదివారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ద్వారా తెలియచేసుకుంది. ఓ భర్త ఓ భార్య వారి పిల్లలు అనేక కుటుంబ యూనిట్‌గా భారతీయ వ్యవస్థ ఉందని కేంద్రం తెలిపింది. జీవధర్మం మేరకు మగవాడిని భర్తగా, ఇదే జీవధర్మంతో ఆడవారిగా ఉండే వారిని భార్యగా పరిగణిస్తారు. వీరికి కలిగే పిల్లలు తల్లిదండ్రుల సంతానంగా ఉంటారని , దీనిని కాదనే ఎటువంటి ప్రక్రియను అయినా అంగీకరించలేమని తెలియచేసుకుంది. గే వివాహాలు, స్వలింగ దాంపత్యాలకు చట్టబద్ధత కల్పించాలనే పలు పిటిషన్లను తాము వ్యతిరేకిస్తున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.

ఆమోదిత సామాజిక విలువలు కట్టుబాట్లకు , వ్యక్తిగత చట్టాలకు మధ్య ఉండే అత్యంత సున్నితమైన సమతూకతను స్వలింగ వివాహాల పద్థతికి అనుమతితో దెబ్బతీసినట్లు అవుతుంది. అంతేకాకుండా సగటు కుటుంబ ప్రామాణితకు విఘాతంగా మారుతుందని కేంద్రం కీలక విశ్లేషణలతో అఫిడవిటును దాఖలు చేసింది. గే పెళ్లిళ్ల చట్టబద్థతకు ఆదేశాలు ఇవ్వాలనే పిటిషన్లు అనేకం సోమవారం సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానున్నాయి. ఐపిసి సెక్షన్ 377లోకి వచ్చే అంశాలు ఇంతవరకూ శిక్షార్హం అయ్యాయి. అయితే ఈ శిక్షార్హతను తొలిగించినప్పటికీ దీని ప్రాతిపదికన పిటిషనర్లు స్వలింగ వివాహాలు తమ ప్రాధమిక హక్కు అని తెలియచేసుకునేందుకు వీల్లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. స్వలింగ వివాహ బంధాన్ని దేశంలోని గుర్తింపు పొందిన చట్టాల పరిధిలోకి తీసుకురావాలనడం కుదరదని తెలిపారు.

ఆంక్షల సడలింపుతో విశృంఖలత అనుచితం

ఒక మగ మరో మగతో కానీ , ఒక ఆడ మరో ఆడతో కానీ లైంగిక బంధం ఏర్పర్చుకుని జీవిస్తే అది చట్టరీత్యా నేరంగా ఉంటూ వచ్చింది. అయితే ఈ విధమైన అసాధారణ జీవిత భాగస్వామ్యంతో భారతీయ కుటుంబ ప్రామాణికత అంశానికి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఇప్పటి చట్టపరమైన ఆంక్షలను తమకు తలెత్తుతున్న సవాళ్లను కొట్టివేయాలని స్వలింగ సంపర్కులు, దంపతులు దాఖలు చేసుకున్న పిటిషన్లను కొట్టివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్రం విన్నవించుకుంది. ఇటీవలి కాలంలో కనీసం నలుగురు గే దంపతులు తమ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని సుప్రీంకోర్టుకు వెళ్లారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తమ పిటిషన్లలో ప్రతివాదులుగా మలిచారు. కేంద్రం హెటిరోసెక్సువల్ సంబంధాలకు పరిమిత స్థాయిలోనే గుర్తింపు ఇచ్చిందని, అయితే దీనికి వెలుపల మరిన్ని జీవన బంధాలు తలెత్తుతున్నాయి.

సహజీవన అనర్థాలతో ఘోరాలు

ఈ వివాహాలు లేదా కలయికలు , వ్యక్తిగత సర్దుబాట్లు, అంగీకారాలతో కలిసి జీవించడాలు ఇవన్నీ కూడా సామాజికంగా మంచివి కావని, చట్టపరం కాబోవని ఇటీవలి సహజీవన దారుణ హత్యలు ఇతర పరిణామాల నేపథ్యంలో కేంద్రం స్పష్టం చేసింది. ఇక పాశ్చాత్య దేశాలు అక్కడి సమాజాలలోని కట్టుబాట్లులేని తనం ఇతరత్రా అంశాలను భారతదేశంలో పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని , మానవ సంబంధాలకు గుర్తింపు అనేది కేవలం శాసనపరమైన విద్యుక్త ధర్మాలు నిర్వహణ ద్వారా వీలవుతుంది. అంతేకానీ జుడిషియల్ లేదా కోర్టు జోక్యానికి సంబంధించినవి కావని తెలిపారు.

చట్టం చట్రాన్ని గాడితప్పేలా చేయరాదు

‘వివాహాలు చట్టంలో ఓ వ్యవస్థ సంబంధిత ప్రక్రియగా ఉంటాయి. సంబంధిత విషయానికి సంబంధించి పలు చట్టబద్ధమైన అంశాలు చట్రంగా నిలుస్తాయి. తలెత్తే పరిణామాలను గుర్తించి తీరాలి. పలు రకాల లెజిస్లేటివ్ చట్టాల ద్వారా ఖరారు అయిన పద్ధతులు వాటి పాటింపు లేదా ఉల్లంఘనలను లెక్కలోకి తీసుకుని తీరాలి. ఇద్దరు యుక్తవయస్కుల మధ్య ఏదో సర్దుబాటుగా, గోప్యంగా కుదిరే మానవ సంబంధంగా దీనిని లెక్కలోకి తీసుకోవడానికి వీల్లేదు. ఈ కోణంలోనే ఇటువంటి అసాధారణ మానవీయ సంబంధాలకు గుర్తింపు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని నిర్థిష్టంగా పరిగణనలోకి తీసుకుని తీరాలి’ అని కేంద్రం స్పష్టం చేసింది. స్వలింగ వ్యక్తుల మధ్య జరిగే వివాహం లేదా అటువంటి బంధం గుర్తింపునకు వీలు కాదు.

ఏ విధమైన అనిర్థిష్ట వ్యక్తిగత చట్టాలు లేదా నిర్థిష్ట అధికారిక చట్టాల పరిధిలో కూడా ఇవి చెల్లనేరవు. పైగా ఇటువంటివి అసలు ఊహించుకోవడానికి కూడా వీల్లేని స్థితి ఉండే వ్యక్తిగత చట్టాలు ఇమిడి ఉన్నాయని కేంద్రం తెలిపింది. స్త్రీ పురుషుల మధ్య వివాహాలతో ఏర్పడే కుటుంబ బంధం వల్ల వ్యవస్థలో ఓ విధమైన కట్టుబాట్లకు , బాధ్యతలకు ఇదే దశలో వారికి కొన్ని హక్కులకు వీలేర్పడుతుంది. ప్రత్యేకించి స్త్రీ పురుషుల మధ్య వివాహ వ్యవస్థ ద్వారా కలిగే పిల్లలు భవిష్యత్తులో మరో తరానికి తల్లిదండ్రులు అవుతారని, అయితే స్వలింగ వివాహాల ఘట్టంలో రేపటి తరం ప్రశ్నార్థకం అవుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News